నులిపురుగుల నివారణకు చిట్కాలు..

0
71

నులిపురుగుల సమస్య పిల్లల్లోనే కాదు, పెద్దల్లోనూ కనిపిస్తుంది. పిన్‌ వార్మ్స్‌, రౌండ్‌ వార్మ్స్‌, హుక్‌ వార్మ్స్‌, టేప్‌ వార్మ్స్‌, ఇలా రకరకాల పురుగులు మన జీర్ణాశయంలోకి చేరుతూ ఉంటాయి. వీటిని నివారించడానికి రకరకాల మందులూ అందుబాటులోకి వచ్చాయి. ఒకవేళ కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే ఈ లక్షణాలు కనిపిస్తాయి.

అతిగా ఆకలి వేయడం. ఆకలి లేకపోవడం. రక్తహీనత. మలద్వారం వద్ద దురద, దగ్గు, వికారం, వాంతులు, విరేచనంలో పురుగులు కనబడటం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆ సమస్య నుంచి గట్టెక్కుతాం.

* ప్రతిరోజూ కాచి, చల్లార్చిన నీటిని తాగాలి. అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ఆహారం తినకూడదు. మలవిసర్జనకు వెళ్లి తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.

* ఇంట్లో ఒకరికి కడుపులో నులిపురుగులుంటే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కడుపులో ఒకసారి పురుగుల సమస్య వచ్చిందంటే చాలు, అవి వాటి సంతానాన్ని త్వరత్వరగా వృద్ధి చేసుకుంటాయి. అయితే, పెరిగినంత వేగంగా తగ్గవు. అందుకే అవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

* ఆహారం తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చేతి గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం, గోళ్లు కొరకకుండా ఉండటం, ఆహారం తీసుకునే ముందు చేతులు కడుక్కోవడం, శుభ్రత లేనిచోట ఆహారం తినకూడదు అనే అంశాల పట్ల చిన్నారులకు అవగాహన కలిగించాలి. మాంసాహారం విషయంలో శుభ్రత చాలా అవసరం. పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగిన తర్వాతనే వాడాలి.

* క్యారెట్‌ తురుమును వరుసగా వారం రోజులపాటు నాలుగు చెంచాలు తినిపించాలి. కడుపులో పురుగులు మలం ద్వారా బయటికి వెళ్లిపోతాయి.

* కొబ్బరి తురుమును పిల్లల వయసును బట్టి మూడు లేదా నాలుగు చెంచాలు తినిపించి రెండు గంటల తర్వాత పావుచెంచా లేదా అరచెంచా గోరువెచ్చని ఆముదాన్ని తాగించాలి. ఇలా చేయటం వలన నులిపురుగులు మలం ద్వారా బయటకు వచ్చేస్తాయి.