ఐదేళ్లు ఐటీ మంత్రిగా పని చేశావు.. గ్లోబరినా తెలియదా: వీహెచ్ విసుర్లు

0
92

తెలంగాణ ఇంటర్ బోర్డు వేసిన మార్కుల మంట ఇప్పట్లో చల్లారేలా లేదు. ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు, విపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు మార్కుల షీటును తయారు చేసిన గ్లోబరినా సంస్థ తనకు తెలియదని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆయన్ను చిక్కుల్లో పడేశాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు.

ఐదేళ్లు రాష్ట్ర ఐటీ మంత్రిగా పని చేసిన కేటీఆర్.. తాను ఇంతవరకు గ్లోబరినా పేరే వినలేదని కేటీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో కేటీఆర్ పచ్చి అబద్ధం చెబుతున్నారన్నారు. కేటీఆర్‌కు దమ్ముంటే పెద్దమ్మ తల్లిపై ప్రమాణం చేసి గ్లోబరినా తనకు తెలియదని చెప్పాలని సవాల్ విసిరారు.

“కేటీఆర్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పెద్దమ్మ గుడికి రావాలి, అక్కడికొచ్చి అమ్మవారిపై ప్రమాణం చేయాలి, ఆ విధంగా చేయలేకపోతే కేటీఆర్‌కు గ్లోబరినా సంస్థతో ఒప్పందం ఉన్నమాట నిజమే అని ఒప్పుకున్నట్టే” అని స్పష్టం చేశారు. ఐదేళ్లపాటు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు గ్లోబరినా తెలియదనడం హాస్యాస్పదంగా ఉందున్నారు.