తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిగా పని చేసి కేటీఆర్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ వంటి వ్యక్తి ఐటీ మంత్రిగా పని చేయడం సిగ్గు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఐటీ కంపెనీల్లో ఒకటైన గ్లోబరినా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి తనకు తెలియదని, అసలు అలాంటి కంపెనీ ఒకటి ఉందని చెప్పడం కేటీఆర్‌కే చెల్లిందన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇంటర్మీడియట్ మార్కుల వ్యవహారం అగ్నిగుండంగా మార్చిన విషయం తెల్సిందే. ఇటీవల వెల్లడైన ఫలితాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇంటర్ బోర్డు అధికారులతో పాటు గ్లోబరినా కంపెనీ చేసిన పొరపాటు వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, సీఎం కేసీఆర్ బయటకు వచ్చి భరోసా కల్పించేలా ఓ ప్రకటన చేసి ఉంటే విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడేదన్నారు. తెలంగాణలో విద్యార్థులపై రూ.10 వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని ఆరోపించారు. 10 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఒక వ్యక్తి చేతికి ఎలా ఇస్తారని నిలదీశారు.
ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వమే రాచబాట వేస్తోందన్నారు. కార్పొరేట్ యాజమాన్యాలకు లబ్ది చేకూర్చే యత్నంలో భాగంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని రేవంత్ విమర్శించారు. ఇంటర్ బోర్డునే తీసేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్య తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.