నేను “గే”ను కాదు బాబోయ్ అంటున్న ఆసీస్ క్రికెటర్

0
54

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్‌కు చిక్కు వచ్చిపడింది. తన 29వ పుట్టిన రోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఓ ఫొటో పెద్ద దుమారం రేపింది. బర్త్‌డే సందర్భంగా తల్లితో పాటు తన మిత్రుడితో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

దానికింద బాయ్‌ఫ్రెండ్‌తో పుట్టినరోజు డిన్నర్‌ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఐదేండ్లుగా కలిసి ఉంటున్నాం అనే అర్థం వచ్చే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశాడు. ఇంకేముంది పుంఖానుపుంఖాలుగా అతడిపై వార్తలు పుట్టుకొచ్చాయి. ఫాల్క్‌నర్ గే అని.. అందుకు అతడు సిగ్గుపడటం లేదని.. దాన్ని దాచుకోకుండా బహిరంగపర్చడం గొప్ప విషయం అంటూ ఎవరికి తోచిన విధంగా వారు రాసుకొచ్చారు.

దీంతో బెంబేలెత్తిపోయిన ఫాల్క్‌నర్ అయ్యా బాబూ మీరంత తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను గేను కాదు. అంటే ఎల్జీబీటీ కమ్యూనిటిని తక్కువ చేసి మాట్లాడటం కాదు కానీ. అతడు నా సన్నిహితుడు. వ్యాపార భాగస్వామి. గత ఐదేండ్లుగా మేము కలిసి ఉంటున్నాం అని వివరణ ఇచ్చుకున్నాడు.

పుట్టిన రోజు సందర్భంగా నేను చేసిన పోస్ట్‌ను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ‘నేను గేను కాదు. రోబ్‌జుబ్‌స్తా (ఫొటోలో ఉన్న స్నేహితుడు) నాకు మంచి మిత్రుడు. గత కొన్నేండ్లుగా మేము ఒకే ఇంట్లో ఉంటున్నాం’ అని మంగళవారం మరో పోస్ట్ పెట్టాడు.

పనిలోపనిగా ఎల్జీబీటీ కమ్యూనిటి నుంచి కూడా విమర్శలు రాకూడదనే చందంగా వివరణ ఇచ్చాడు. ఈ అంశంపై అత్యుత్సహంతో ముందే స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా నాలుక్కరుచుకుంది. తప్పు తెలుసుకొని ఫాల్క్‌నర్‌కు క్షమాపణలు చెప్పింది. కాగా, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టీవెన్ డేవీస్ 2011లో తొలిసారి గేనని బహిరంగంగా ప్రకటించుకున్నాడు.