టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్. బాహుబలి తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ యేడాది ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్… తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎక్కువగా అభిమానుల గురించే మాట్లాడారు. ప్రేక్షకులు తనను ఈ స్థాయిలో ప్రేమించడం, ఆదరించడాన్ని అదృష్టంగా భావిస్తానని చెప్పారు.
తాను స్క్రిప్ట్ ఎంపిక చేసుకునేప్పుడు అభిమానులనే దృష్టిలో పెట్టుకుంటానని, వారు తనను ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నారో ఆలోచించి, అలాంటి పాత్ర ఉన్నట్టయితేనే ఆ స్క్రిప్ట్‌కు ఆమోదముద్ర వేస్తానని వెల్లడించారు.
“బాహుబలి” తర్వాత ఫ్యాన్స్ తన నుంచి ఎంతో ఆశిస్తుంటారని, వారి అంచనాలు అందుకోవడంపైనే దృష్టి పెడతానని చెప్పారు. “చాలావరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. పాత్రలో నేను ఇమిడిపోగలనా? అనే విషయం ఆలోచిస్తాను. అయితే అది అభిమానులకు నచ్చే విధంగా ఉంటుందనిపిస్తేనే ఓ సినిమా అంగీకరిస్తాను” అంటూ చెప్పుకొచ్చారు.