‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు ఈసీ బ్రేక్

0
43

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విడుదలకాలేదు. దీంతో మే ఒకటో తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

అయితే, ఇపుడు కూడా బ్రేక్ పడింది. ఈ చిత్ర విడుదలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బయోపిక్‌లపై రాజకీయ పార్టీలు తెలిపిన అభ్యంతరం మేరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాల విడుదలపై ఈసీ ఆంక్షలు విధించింది.

తదుపరి ఉత్తర్వులను వెలువరించేంత వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఏప్రిల్ 10న వెలువరించిన ఆ ఉత్తర్వులో పేర్కొంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా విడుదలపై తరుపరి ఉత్తర్వులు ఇవ్వలేదని ఎన్నికల సంఘం తెలిపింది. అంతేకాదు, ఉత్తర్వుల ప్రతిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు పంపింది. సినిమా థియేటర్లలో చిత్ర ప్రదర్శనకు అనుమతి ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఫలితంగా ఆర్జీవీకి మరోమారు నిరాశే ఎదురైంది.