లైంగిక వేధింపులు… అసాంజేకు 50వారాల జైలుశిక్ష

0
43

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు లండన్ సౌత్ వార్క్ క్రౌన్ న్యాయస్థానం 50 వారాల జైలుశిక్ష విధించింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజే గతంలో ఓసారి అరెస్ట్ అయి బెయిల్‌పై బయటికొచ్చారు. కానీ నిర్ణీత గడువులోపల పోలీసుల ఎదుట హాజరుకాకుండా ఈక్వెడార్‌ను శరణుజొచ్చి లండన్‌లోని వారి దౌత్య కార్యాలయంలో ఏడేళ్లపాటు ఆశ్రయం పొందారు.

ఇటీవలే ఈక్వెడార్ అసాంజేకి ఆశ్రయాన్ని వెనక్కి తీసుకోవడంతో అతడిని పోలీసులు బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. కాగా, కోర్టులో విచారణ సందర్భంగా, తమ క్లయింటు ఎంతో నిరాశలో కూరుకుపోయి ఉండడం వల్ల తిరిగి పోలీసుల ఎదుట హాజరుకాలేకపోయాడంటూ అసాంజే తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

అయితే, న్యాయమూర్తి డెబొరా టేలర్ ఇదేమీ పట్టించుకోకుండా, అసాంజే ఈ ఏడేళ్లపాటు ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకున్నందువల్ల 21 మిలియన్ డాలర్ల ప్రజాధనం వృథా అయిందని, దానికేం బదులు చెబుతారంటూ ప్రశ్నించారు.