పాములతో ప్రియాంకా గాంధీ ఆటలు..

0
63

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర తూర్పు విభాగం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పాములతో చెలగాటమాడారు. ఈ ఆసక్తికర సన్నివేశం రాయబరేలి పర్యటనలో చోటుచేసుకుంది. కుచరియ గ్రామంలో ప్రియాంక పర్యటిస్తున్న సందర్భంలో పాములు పట్టేవాళ్ళు తారసపడ్డారు. వారితో కాసేపు ముచ్చటించిన ఆమె ఏమాత్రం భయంలేకుండా తన చేతుల్తో వాళ్ళ దగ్గరున్న పాములను పట్టుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఒక పెద్ద పాము బుట్టలో ఉంటే మూత తీసి ఆ పామును తడిమారు. ఓ చిన్నపామును చేతుల్లోకి తీసుకొని తిరిగి బుట్టలో పెట్టారు. తన కాళ్ళ దగ్గరే తాచుపాము కదులుతున్నా కూడా ప్రియాంక.. ఎటువంటి కలవరం లేకుండా.. పాములు పట్టే వాళ్ళతో సంభాషించారు.

చుట్టుపక్కల గుమిగూడిన జనంలో నుంచి ఒకరు జాగ్రత్త, అవి ప్రమాదకరమైనవి అని హెచ్చరించారు. ఏం జరుగదు.. ఫర్వాలేదు అంటూ అతన్ని ప్రియాంక సమాధానపరిచారు. కుచ్ నహీ కరేగా, ఆప్ క్యూ ఘాబ్రా రహే హో? (ఇది ఏం చేయదు. ఎందుకు భయపడుతున్నారు?) అంటూ వెనుక నిల్చున్న మరో వ్యక్తిని ఉద్దేశిస్తూ ప్రియాంక ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఆ తర్వాత ఆమె ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, తన ప్రాణాలైనా వదిలిపెట్టేందుకు సిద్ధమని, బీజేపీకి మేలు చేసే పనులు మాత్రం చేయబోనని తేల్చిచెప్పింది. పైగా, నిజమైన జాతీయవాదం అంటే దేశాన్ని, దేశ ప్రజలను ప్రేమించడమని.. ఐతే, దేశాన్ని, ప్రజలను బీజేపీ ఎంతమాత్రం ప్రేమ, గౌరవంతో చూడట్లేదని ఆమె ఆరోపించారు.

ప్రజల సమస్యలను ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని ఆమె దుయ్యబట్టారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం.. ప్రజలు ఏం చెబుతున్నారో వినడం, దేశంలోని వ్యవస్థలను బలపరుస్తూ.. ప్రజాస్వామ్యయుతంగా నడుచుకోవడమే దేశభక్తి. ఇది ఏ రాజకీయ నాయకుడికైనా, ప్రభుత్వానికైనా వర్తిస్తుందని ఆమె అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యపరచడం దేశభక్తి కాదని, ప్రధాని మోడీకి దేశంలోని ప్రజలు మే 23న వెలువడే ఎన్నికల ఫలితాల ద్వారా ఓ సందేశం ఇస్తారని ప్రియాంక ధ్వజమెత్తారు.