ఓడిపోతాడని తెలిసే మూటముల్లె సర్దుకుంటున్నారు : జీవీఎల్

0
57

ఈనెల 23వ తేదీన వెల్లడయ్యే ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓడిపోనున్నారనీ, అందుకే ఆయన తెగ హడావుడి చేస్తున్నారంటూ బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు.

ఫణి తుఫానుపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీనిపై జీవీఎల్ స్పందిస్తూ, సమీక్షల విషయంలో రాద్ధాంతం చేయడం తగదన్నారు. ఐదేళ్లలో ఏమీ చేయని ముఖ్యమంత్రి ఇప్పటికిప్పుడు సమీక్షలు చేయడం ద్వారా ఎంతో జరుగుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రాష్ట్రంలోని రైతులు కరవుతో దిక్కుతోచని స్థితిలో ఉంటే చంద్రబాబు ఏ సమీక్ష చేశారని జీవీఎల్ ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసిన తరుణంలో చంద్రబాబు సమీక్షల హడావుడి చూస్తుంటే ఓటమి ఖాయమని తెలిసి, అవకాశం ఉన్న ప్రతి ఒక్క చోటా దండుకోవడానికే సమీక్షలు చేస్తున్నట్టుగా ఉందని ఆరోపించారు.

అంతేగాకుండా, చంద్రబాబు తన ఓటమికి ఇతర రాజ్యాంగ సంస్థలను బాధ్యులుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. ఈసీతో సంప్రదింపులు జరిపాకే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని, చంద్రబాబుకు ఇది కూడా తెలియకపోతే ఎలా? అంటూ నిలదీశారు. అయినా ప్రతి విషయం రాజకీయం చేయాలనుకుంటున్న చంద్రబాబు తనపై తానే ఒత్తిడి పెంచుకుంటున్నారు తప్ప, ఒరిగేదేమీ లేదన్న విషయం గుర్తెరగాలని హితవు పలికారు.