ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో ఎన్నికల ప్రచార చేశారు. రెండ్రోజుల పాటు ఆయన ఇక్కడ పర్యటించారు. తన ప్రసంగంలో ఎక్కడా కూడా అయోధ్య రామమందిర అంశాన్ని ప్రస్తావించలేదు. పైగా, జై శ్రీరాం అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. అక్కడ ఏ ఆలయాన్ని కూడా సందర్శించలేదు. ఇది స్థానికులను తీవ్ర నిరాశపరిచింది.
ఇదే అంశంపై కేంద్రంలోని బీజేపీ మిత్రపక్షం శివసేన తీవ్ర అసహనంతో ఉంది. దీన్నే అక్కడి శివసేన అభ్యర్థి మహేశ్ తివారి ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నారు. గత ఐదేళ్లలో మోడీ ఒక్కసారి కూడా మందిరాన్ని సందర్శించలేదంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. దీంతో హిందూ ఓట్లలో చీలక వచ్చి బీజేపీకి నష్టం జరగినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు, అటు కాంగ్రెస్ కూడా అయోధ్య అభివృద్ధి అంశాన్నే ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రచారం చేస్తోంది. నిరుద్యోగం, వీధి పశువుల సమస్యలు ప్రజలను పీడిస్తున్నాయని అంటున్నారు. ఈ ఐదేళ్లలో అయోధ్యకు కొత్తగా ఒక్క పరిశ్రమ రాలేదని, ఉద్యోగాల కల్పన జరగలేదని ఆయన విమర్శిస్తున్నారు.
ఇకపోతే, ఎస్పీ అభ్యర్థి ఆనంద్ సేన్ కూడా బీజేపీపై దాదాపు ఇవే ఆరోపణలు చేస్తున్నారు. వీటిని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. తమ హయాంలో అయోధ్య పర్యాటక రంగం పరంగా గొప్ప అభివృద్ధి సాధించిందని.. 2018లో అయోధ్యకు 1.92 కోట్ల మంది పర్యాటకులు వచ్చారని, 2016 కన్నా ఈ సంఖ్య దాదాపు 35లక్షలు ఎక్కువని విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఈ స్థానంలో బీజేపీ – ఎస్పీల మధ్యే తీవ్రపోటీ నెలకొంది.