పాకిస్థాన్ పట్ల మోదీ పిల్లి మొగ్గలు : మన్మోహన్ సింగ్

0
56

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. మోడీని అధికారం నుంచి సాగనంపాల్సిన తరుణం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. మోడీ ఐదేండ్ల పరిపాలనలో దేశంలోని యువతకు, రైతులకు, వ్యాపారులకు, ప్రతి ప్రజాస్వామ్య సంస్థకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని నిప్పులు చెరిగారు.

దేశంలో మోడీ అనుకూల పవనాలు వీస్తున్నాయన్న అభిప్రాయాన్ని తోసిపుచ్చారు. సమ్మిళిత అభివృద్ధిని విశ్వసించకుండా కేవలం రాజకీయ అస్థిత్వం కోసం పాకులాడుతున్న మోడీ సర్కారును గద్దెదించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.

మోడీ హయాంలో అవినీతి అనూహ్యమైన స్థాయికి పెరిగిందని, రాజకీయ పదవుల్లో ఉన్న వ్యక్తులు బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన మోసగాళ్లతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమన్నారు.

పాకిస్థాన్ పట్ల మోడీ పిల్లి మొగ్గలు వేస్తున్నారని, తన వైఖరిని పదేపదే మార్చుకుంటూ నిర్లక్ష్య విధానం అనుసరిస్తున్నారన్నారు. ఆహ్వానం లేకుండా పాకిస్థాన్‌కు వెళ్లిన మోడీ.. నయ వంచనకు మారుపేరైన ఐఎస్‌ఐని ఉగ్రవాద దాడిపై దర్యాప్తు కోసం పఠాన్‌కోట్ వైమానిక స్థావరానికి ఆహ్వానించారని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ సర్కారు కష్టాల కొలిమిలోకి నెట్టిందని, దీంతో ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తున్నదని తెలిపారు.

విఫలమైన ట్రాక్ రికార్డుతో బీజేపీ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిందని, అందుకే రోజుకో కొత్త ఎత్తుగడ కోసం వెతుకులాడుతున్నదని మన్మోహన్ విమర్శించారు. ప్రజలకు సుపరిపాలన అందించడంలో, జవాబుదారీగా వ్యవహరించడంలో మోడీ సర్కారు దారుణంగా విఫలమైంది.

ప్రజలకు మంచి రోజులు (అచ్చే దిన్) తీసుకొస్తామని నమ్మబలికి 2014లో అధికారంలోకి వచ్చారు. ఈ సర్కారు పట్ల భ్రమలు తొలిగిపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నది. వారంతా బీజేపీని తిరస్కరించాలని నిశ్చయించుకున్నారు. ఇకపై దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది అని మన్మోహన్నారు.