అప్పు చెల్లించలేక స్నేహితుడుని హత్య చేశాడు..

0
103

తెలంగాణ రాష్ట్రంలో మరో హత్య జరిగింది. తీసుకున్న అప్పు చెల్లించలేక చివరకు స్నేహితుడునే మట్టుబెట్టాడు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండల పరిధిలోని కేశవరం గ్రామంలో చోటు చేసుకున్నది.

ఈ వివరాలను పరిశీలిస్తే, మండల పరిధిలోని కేశవరం గ్రామానికి చెందిన కుర్వ మల్లేశ్, కుర్వ వీరేశ్‌లు ఇద్దరు స్నేహితులు. కుర్వ మల్లేశ్ నుంచి వీరేశ్ మూడు లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించమని ఒత్తిడి తీసుకురాగా ఈరోజు రేపు అంటూ దాటవేస్తూ వచ్చాడు.

కానీ, ఈ నెల 2వ తేదీన అప్పు తీర్చాలని మల్లేశ్ తీవ్ర ఒత్తిడి తీసుకురాగా వీరేశ్ ఒత్తిడిని తట్టుకోలేక మల్లేశ్‌ను ఎలాగైన హతమార్చాలని పన్నాగం పన్నాడు. ఆ దశలోనే ఇద్దరు కలిసి ఆరోజు రాత్రి గ్రామ సమీపంలో ఉన్న పంట పొలంలోకి వెళి మద్యం తాగారు. మద్యం మత్తులో వీరేశ్, మల్లేశ్ (25)తలపై బండ రాయితో బాది హతమార్చాడు.

ఆ తర్వాత వీరేశ్ తన సమీప బంధువును పిలిచి.. మల్లయ్య ఆలయ సమీపంలో మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ముద్దలా మారిన మల్లేశ్ మృతదేహాన్ని సమీపంలో ఉన్న కాలువలో పూడ్చిపెట్టారు. తమ బిడ్డ కనిపించకపోవడంతో మృతుడి తండ్రి దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని వీరేశ్‌ను విచారించగా మల్లేశ్‌ను వీరేశ్ హత్యచేసినట్లు అంగీకరించాడు.