ఎన్టీఆర్‌ చేతికి గాయం… లక్ష్మీ ప్రణతితో జూనియర్.. ఫోటో వైరల్

0
39

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌కు మరో బ్రేక్ పడింది. ఇటీవల పూణేలో షూటింగ్ జరుగుతుండగా రామ్‌చరణ్‌ గాయపడటంతో షూటింగ్‌ను అర్థాంతరంగా మూడు వారాల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

చరణ్ గాయం తగ్గటంతో ఇటీవల హైదరాబాద్‌లో తిరిగి షూటింగ్ ప్రారంభించారు. అయితే తాజాగా మరో హీరో ఎన్టీఆర్‌ కూడా గాయపడినట్టుగా తెలుస్తోంది. కుడి చేతికి కట్టుతో ఉన్న ఎన్టీఆర్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నందమూరి హీరో కూడా తన వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని భార్య లక్ష్మీప్రణతితో ఉన్న ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలో జూనియర్ ఎన్టీఆర్ చేతికి కట్టుతో కనిపించారు. ఇటీవలే ఆయనకు ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ సందర్భంగా గాయమైంది. దాంతో కుడిచేయి మణికట్టును కవర్ చేస్తూ బ్యాండేజ్ ధరించారు.

కాగా, ఈ ఫొటోకు తారక్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. తమ పెళ్లయి ఎనిమిదేళ్లయిందని, ఇలాంటి మధుర క్షణాలు మరెన్నో రావాలని ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పోస్టు పెట్టారో లేదో అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. వేల సంఖ్యలో లైకులు, షేర్లతో ఫేస్‌బుక్‌ను హోరెత్తిస్తున్నారు. 2011లో ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి పెళ్లి జరిగింది. వీరికి అభయ్ రామ్, భార్గవరామ్ అనే కుమారులున్నారు.

భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమురం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. అలియా భట్‌ ఒక హీరోయిన్. మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతుంది. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్.