దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కో దశ పూర్తవుతున్న కొద్దీ రాజకీయవర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. 7 దశల సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా సోమవారం ఐదో దశలో 51 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
ఇప్పటివరకూ ఎన్నికలు జరిగిన 373 స్థానాల్లో ఎన్డీయే 140 సీట్లు గెలుచుకుంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఎన్డీయేకి ముఖ్యంగా బీజేపీకి ఇప్పటి నుంచి పోలింగ్ జరిగే నియోజకవర్గాలే కీలకం. సోమవారం పోలింగ్ జరిగే 51 స్థానాల్లో 2014లో ఎన్డీయే 41 చోట్ల.. అందులో బీజేపీ 39 స్థానాల్లో గెలిచింది.
ఈ సారి ఎన్డీయే 15-20స్థానాల్లోనే గెలుస్తుందని అంటున్నారు. మిగతా రెండు దశల్లో ఎన్నికలు జరిగే 118 స్థానాల్లోనూ ఎన్డీయే సాధ్యమైనన్ని సీట్లు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తుందని, ఎన్డీయే సంఖ్యా బలం 200 దాటి 230 వరకూ చేరేందుకు అవసరమైన అన్ని వ్యూహాలు రచిస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ముఖ్యంగా, బీజేపీకి పట్టుగొమ్మలా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఈసారి చావుదెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సోమవారం పోలింగ్ జరిగే 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ గతంలో 12 సీట్లు గెలుచుకుంది. ఈసారి 5 స్థానాలు గెలవడమూ కష్టమని పరిశీలకుల అంచనా.
రాయ్‌బరేలీ, అమేఠీల్లో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ గెలిచే అవకాశాలుండగా.. సీతాపూర్, బహ్రయిచ్, బారాబంకీ, దరోరాలో పోటీని కాంగ్రెస్ త్రికోణాత్మకంగా మార్చింది. లక్నో, కైసర్‌గంజ్, ఫైజాబాద్, ఫతేపూర్‌లలో బీజేపీ ముందంజలో ఉండగా.. మిగతాచోట్ల మహాకూటమి పుంజుకునే అవకాశాలున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఎన్నికలు జరుగుతున్న 7 సీట్లను బీజేపీ గతంలో గెలుచుకుంది. ఈసారి 4 సీట్లలో అంటే ఖజురాహో, సాత్నా, బేతుల్, దామోలలో కాంగ్రెస్ గెలవొచ్చని, మిగతా 3 బీజేపీకి దక్కవచ్చని రాజకీయవర్గాల అంచనా. రాజస్థాన్‌లోని 12 సీట్లలో గతంలో బీజేపీ హవాసాగింది. ఈసారి 5-6 సీట్లు కోల్పోతుందని అంచనా వేస్తున్నారు. జార్ఖండ్‌లోని 4 సీట్లలో బీజేపీకి ఒకటే దక్కుతుందని భావిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లోని 7 సీట్లలో బీజేపీ ఒక్క సీటు కూడా దక్కించుకునే అవకాశాలు లేవు.