ఈ నెల 23వ తేదీన పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, లెక్కింపు ప్రక్రియలో భాగంగా మొదట ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారని, తర్వాత నియోజకర్గానికి ఓ అయిదు వీవీప్యాట్లను ర్యాండమ్‌గా ఎంపిక చేసి లెక్కిస్తారని చెప్పారు.
ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్ల ఓట్లకు మధ్య వ్యత్యాసం లేకపోతే ఫలితాలను ప్రకటిస్తారన్నారు. వ్యత్యాసం ఉంటే వీవీ ప్యాట్ ఓట్లను మరొకసారి లెక్కిస్తారని, అప్పటికీ మార్పులేకపోతే వీవీప్యాట్ ఓట్లను మొత్తం లెక్కిస్తారని, ఆ లెక్క ఆధారంగానే ఫలితాలను ప్రకటిస్తారని వివరించారు.
మధ్యాహ్నం భోజన సమయానికి ఫలితాలు తెలుస్తాయని, అధికారికంగా ప్రకటించడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడు అంచల గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు, రాష్ట్రంలోని 5 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఈ నెల 6వ తేదీన పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు ఆయన తెలిపారు. ఈవీఎంల సమస్య గానీ, శాంతి భద్రతల సమస్య గానీ తలెత్తలేదన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎన్నికల సిబ్బంది, పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా తమ విధులు నిర్వహించారని అభినందించారు.
మొత్తం 5 కేంద్రాలకు 4 కేంద్రాలలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తి అయిందని, ఒక కేంద్రంలో మాత్రం 47 మంది క్యూలో నిలబడి ఉండటంతో అక్కడ రాత్రి 7 గంటలకు పోలింగ్ పూర్తి అవుతుందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ పూర్తి అయినట్లేనన్నారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని కేశనపల్లిలో 89.23 శాతం పోలయ్యాయయని తెలిపారు. అక్కడ 956 మంది ఓటర్లకు 853 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో 75.43 శాతం పోలైనట్లు తెలిపారు. అక్కడ 1396 మంది ఓటర్లకు 1053 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో 87.01 శాతం పోలైనట్లు తెలిపారు. అక్కడ 1070 మంది ఓటర్లకు 931 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ఇసుకపాలెంలో 75.55 శాతం పోలింగ్ జరిగినట్లు తెలిపారు. అక్కడ 1084 మంది ఓటర్లకు 819 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు.
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజవర్గంలోని అటకానితిప్ప పోలింగ్ స్టేషన్లో 84.23 శాతం పోలైనట్లు తెలిపారు. అక్కడ 558 మంది ఓటర్లకు 470 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నరని చెప్పారు. రీ పోలింగ్‌కు సంబంధించిన 5 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 5,064 మంది ఓటర్లు ఉండగా, 4,126 మంది (81.48 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించారు.