వేపనూనెతో ఎన్ని ఉపయోగాలో…

0
40

వేపనూనె అనగానే మొక్కలకు క్రిమిసంహారిణిగా మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటు. వేపనూనెతో రోజువారీ ఉపయోగాలూ బోలెడున్నాయి. కొందరి కాళ్లకు ముఖ్యంగా పరుగు పెట్టేవాళ్ల పాదాలకి ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. అలాంటి వారు వేపనూనెలో కాస్త పసుపు కలిపి పాదాలకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

చాలామందిలో గోళ్లు తరచూ పెళుసుబారడం, విరగడం, పుచ్చిపోవడం జరుగుతుంటాయి. దీనికి కారణం ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు. అలాంటి వారు వేప నూనెని నాలుగైదు చుక్కలు తీసుకుని గోళ్ల మీద రాయాలి. ఇలా రోజుకు రెండుమూడు సార్లు చేస్తే వారం తిరిగే సరికి ఈ సమస్య అదుపులోకి వస్తుంది.

స్కూల్‌కి వేళ్లే చిన్నారుల్లో తలలో పేల (పేలు) సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లకు కొబ్బరినూనెలో కాస్త వేపనూనెను కలిపి తలకు పట్టించి తలస్నానం చేయిస్తే పేలు వదిలిపోతాయి. వేప నూనెను ఒక స్ప్రే సీసాలో తీసుకుని సింకు దగ్గర పెట్టుకోవాలి. చేతులు శుభ్రం చేసుకోవడానికి ముందు ఈ నూనెతో చేతులు కడుక్కుంటే చేతులకున్న క్రిములు పూర్తిగా వదిలిపోతాయి.

చాలామంది చర్మం నల్లగా మారే పిగ్మెంటేషన్‌ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటప్పుడు ఆ ప్రాంతంలో వేపనూనెను రాసి మర్దన చేసుకుంటే పిగ్మెంటేషన్‌ అదుపులోకి వస్తుంది.