మోడీ శరీరం మొత్తం ప్రజల రక్తంతో తడిసిపోయింది : మమతా బెనర్జీ

0
67

అధికారంలో ఉన్న ఐదేళ్ళ కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క రాముడి గుడి అయినా నిర్మించారా అంటూ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలదీశారు. బీజేపీకి ఎన్నికలకు ముందు మాత్రమే రాముడు గుర్తుకు వస్తారన్నారు. అంటే బీజేపీ ఎన్నికల ఏజెంట్ రాముడు అని మండిపడ్డారు.

మమతా బెనర్జీపై నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. పశ్చిమబెంగాల్‌ మూడు ‘టి’లకు ప్రసిద్ధి చెందిందని.. అవి తృణమూల్‌, టోలాబాజీ(బలవంతపు వసూళ్లు), పన్నులు(టాక్స్) అని మోడీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మమత స్పందిస్తూ.. ‘దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని గౌరవించాలి. నిన్న మీరు మాజీ ప్రధాని రాజీవ్‌ను నంబర్‌ 1 అవినీతిపరుడు అన్నారు. ఇవ్వాళ నన్ను బలవంతపు వసూళ్లకు పాల్పడేదాన్ని అంటున్నారు. మరి మీరేంటి? మిమ్మల్ని ఏమనాలి? మీ శరీరం మొత్తం ప్రజల రక్తంతో తడిసిపోయింది. అల్లర్లు, అల్లర్లు, కేవలం అల్లర్లే’ అని దుయ్యబట్టారు.

బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని, రాజకీయ హింస పేట్రేగిపోయిందని మోడీ ఆరోపించగా.. ఓట్ల కోసం రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మమత విమర్శించారు. పురూలియాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మమత మాట్లాడారు.

‘జైశ్రీరామ్‌ నినాదాలు చేసేవారిని బెంగాల్‌ సీఎం అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. జైశ్రీరాం అంటే నన్ను కూడా అరెస్టు చేయిస్తారా?’ అన్న మోడీ వ్యాఖ్యలపైనా మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు తరచూ జైశ్రీరాం నినాదాలు చేస్తుంటారు. కానీ, ఇప్పటివరకు ఒక్క రామమందిరమైనా కట్టించారా?’ అని నిలదీశారు.