ఇటీవల బాలీవుడ్ బుల్లితెర నటుడు కరణ్ ఒబెరాయ్ అత్యాచారం కేసులో అరెస్టు అయ్యాడు. ఈయనతో బాలీవుడ్ నటి పూజా బేడీ కొంతకాలం సహజీవనం కూడా చేసింది. దీంతో తన మాజీ ప్రియుడు ఒబెరాయ్ అరెస్టు కావడంతో ఈ అమ్మడు తెగ బెంగపడిపోతోంది.
కరణ్ ఒబెరాయ్ అరెస్టుపై పూజాబేడీ స్పందిస్తూ, ఒబెరాయ్‌పై అత్యాచారం కేసు పెట్టిన మహిళ అత్యాచార చట్టాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ‘నేను మహిళల హక్కులకు వ్యతిరేకం కాదు. మా కుటుంబం అంతా మహిళల హక్కులకు ఎంతో విలువనిస్తుందని అందరికీ తెలుసు. మహిళలు శక్తివంతంగా, దృఢంగా ఉండాలని, మహిళా హక్కుల విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని నేనెప్పటి నుంచో వాదిస్తున్నాను.
అయితే ఈ రోజు నుంచి నేను పురుషుల హక్కులు, ‘మెన్ టూ మూమెంట్’కు కూడా మద్దతిస్తున్నాను. బలహీన వర్గానికి మద్దతివ్వాలనే భావనతో ఏకపక్షంగా చేస్తున్న కొన్ని చట్టాలు ప్రతికూల ఫలితాలనిస్తున్నాయి. మహిళలపై అత్యాచారం, దోపిడీలను నివారించడానికి ఏర్పాటు చేసిన చట్టాలను కొందరు స్త్రీలు దుర్వినియోగం చేస్తున్నారు. తమ వ్యక్తిగత కక్ష, ప్రతీకారాల కోసం వాడుకుంటున్నారు.
నా స్నేహితుడు ఒబేరాయ్‌తో కలిసి జీవించిన ఓ మహిళ ఇప్పుడు అతనిపై అత్యాచారం కేసు ఫైల్ చేసింది. అందువల్ల అతని కెరీర్ నాశనమైంది. కుటుంబం ఎంతో క్షోభను అనుభవిస్తోంది. సమాజంలో పరువు మర్యాదలు స్త్రీలకే కాదు.. పురుషులకు కూడా ఉంటాయి. స్త్రీల నుంచి పురుషులు కూడా కొన్ని వేధింపులు ఎదుర్కొంటున్నారు. ‘మెన్ టూ మూమెంట్’ మొదలవడానికి సమయం వచ్చింది అంటూ పూజా ట్వీట్ చేసింది.