దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫాసిస్టు(నియంతృత్వ) ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా తాను సాగిస్తున్న ప్రచారాన్ని 1942 క్విట్ ఇండియా ఉద్యమంతో ఆమె పోల్చారు.
పశ్చిమ బెంగాల్ దేబ్రా పట్టణంలో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ.. ఒకవేళ మోడీ తిరిగి అధికార పగ్గాలు చేపడితే, దేశంలో ప్రజాస్వామ్యం, ప్రజలకు స్వాతంత్య్రం ఉండదని, ఈ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
దేశంలో అత్యయికస్థితి లాంటి పరిస్థితులు నెలకొన్నాయని, ఆయనకు భయపడి ప్రజలు బహిరంగంగా ఏమీ మాట్లాడలేకపోతున్నారని.. ప్రజల్ని భయపెట్టే నియంతృత్వ పాలనను ఆపాలని మోడీకి హితవు పలికారు.
బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం మొదలైతే, నియంతృత్వ మోడీని గద్దె దింపడానికి తాము పోరాడుతున్నామని మమత చెప్పుకొచ్చారు. మోడీకి బెంగాల్ ప్రజలు పెద్ద రసగుల్లా(సున్నా సీట్లు) ఇస్తారని వ్యంగ్యంగా విమర్శించారు.