కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని.. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే, రైతులను మోసం చేసిన రాబర్ట్ వాద్రాను జైలుకు పంపించడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. రైతులను లూటీ చేసిన వారిని కోర్టుకు ఈడుస్తానని అన్నారు. రైతులను మోసం చేసిన వారు తమను ఎవరూ తాకలేరని అనుకుంటున్నారని, అటువంటి వాళ్లను దాదాపు జైలు గుమ్మం వరకూ తీసుకెళ్లానని వ్యాఖ్యానించారు. దేశాన్ని దోచుకున్న వారి నుంచి ఆ సొమ్మును కక్కిస్తానని చెప్పిన మోదీ, ఎన్నికల పోరులో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేతులెత్తేశాయని ఎద్దేవా చేశారు.
మోదీ వ్యాఖ్యలపై వాద్రా స్పందించారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా ప్రధాని మోదీ తన గురించి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా విమర్శించారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, మహిళా సాధికారత మొదలైన సమస్యలు ఎన్నో ఉంటే వాటిని పక్కనపెట్టి తన గురించి మోదీ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఐదేళ్లుగా మోదీ ప్రభుత్వం నుంచి తనకు వేధింపులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, పన్నుల శాఖల నుంచి తనకు నోటీసులు అందుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి చర్యల ద్వారా తనపై మానసిక ఒత్తిడి పడేలా చేస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రసంగాల ద్వారా తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలను దయచేసి ఆపాలని కోరారు. ఇప్పటి వరకూ తనకు ఎన్నో సమన్లు జారీ చేశారని, అయితే, ఏ ఒక్క ఆరోపణను రుజువు చేయలేదని వాద్రా పేర్కొన్నారు.