మహిళ ప్రసవిస్తుండగా ఫోటోలు తీసి వాట్సాప్‌లో షేర్…

0
42

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్యం కేంద్రంలో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ మహిళ బిడ్డను ప్రసవిస్తున్న సమయంలో ఫొటోలు తీసి వాట్సప్‌లో షేర్ చేశారు. కాన్పు సమయంలో ఫొటోలు తీయడం నిషేధమైనప్పటికీ ఆస్పత్రిలోని నర్సులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు తీశారు. పైగా, వాటిని షోల్ మీడియాలో పోస్ట్ చేసి తమ పైశాచికానందాన్ని పొందారు

ఈనెల 3వ తేదీన ఓ మహిళ పురిటినొప్పులతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆస్పత్రిలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో నర్సులే కాన్పు చేశారు. కాన్పు చేస్తున్న సమయంలో ఆస్పత్రి సిబ్బంది ఫొటోలు తీశారు. సాధారణ కాన్పు చేయడం ద్వారా తామేదో సాధించామని చెప్పుకునేందుకు వాటిని వాట్సప్‌లో షేర్ చేశారు.

ఇప్పుడీ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. మహిళల మనోభావాలు దెబ్బతీసేవిధంగా నర్సులు ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.