మానవత్వం మంటగలిసిపోయింది. మనిషి తోలుకప్పుకున్న కొందరు మృగాళ్లు ఎదుటి వ్యక్తి కూడా మనిషే అన్న సంగతి మరిచిపోయారు. తమ ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు మానవ మలం తినిపించారు. శరీరంపై మూత్రం పోశారు. చేతుల్ని వెనక్కి కట్టేచి గొడ్డును బాదినట్టు బాదారు. మూడేండ్ల క్రితంనాటి శతృత్వానికి పరాకాష్టగా ఈ దారుణానికి ఒడిగట్టారు.
తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువరూర్ జిల్లాలోని తిరువందురై గ్రామానికి చెందిన దళితుడు పి. కొల్లిమలై(43) తన ఇటుకబట్టీలో పనులు ముగించుకొని అర్ధరాత్రి ఇంటికి తిరిగివస్తుండగా.. అదే గ్రామానికి చెందిన కల్లార్ కులస్థులైన శక్తివేల్, రాజేశ్, రాజ్కుమార్లు అడ్డగించి కర్రలతో చితకబాదారు.
అనంతరం మానవ మలంను బలవంతంగా తినిపించారు. చేతులు వెనక్కి కట్టేసి ముఖంపై మూత్రం పోశారు. మూడేండ్ల క్రితం ఓ ఆలయం వద్ద కొల్లార్, దళిత వర్గాల మధ్య గొడవ చోటుచేసుకొన్నది. దళితుడు తమను ప్రశ్నించడమేమిటని కొల్లిమలైపై శతృత్వం పెంచుకొన్న శక్తివేల్ సహా మరో ఇద్దరు.. గత నెల 28న ఆయనపై ఈ దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు మానవ మృగాలను అరెస్టు చేశారు.