సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుటుంబాన్ని వదిలిపెట్టడం లేదు. నిన్నటికి నిన్న రాజీవ్ నంబర్ వన్ అవినీతిపరుడంటూ విమర్శలు గుప్పించిన మోడీ… ఇపుడు ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను రాజీవ్ ఫ్యామిలీ తమ కుటుంబ ట్యాక్సీగా వాడుకుందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
బుధవారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. గాంధీ కుటుంబ విడిదికి వినియోగించడం ద్వారా ఐఎన్‌ఎస్ విరాట్‌ను కాంగ్రెస్ అవమానించిందని ధ్వజమెత్తారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నాటి కేంద్ర ప్రభుత్వం, నావికాదళం గాంధీ కుటుంబ సేవలో తరించిందని, వారి కోసం ఓ హెలికాప్టర్‌ను కూడా వినియోగించిందని ఆరోపించారు.
రాజీవ్‌గాంధీ, ఆయన కుటుంబం 10 రోజులు సెలవుపై వెళ్లినప్పుడు ఇది జరిగింది. ఆ సమయంలో దానిని పది రోజులుపాటు ఓ దీవిలో నిలిపారు. రాజీవ్‌గాంధీతో పాటు ఇటలీ నుంచి వచ్చిన ఆయన బంధువులు కూడా ఉన్నారు. యుద్ధ నౌకలో విదేశీయులకు ప్రవేశం కల్పించడం ద్వారా దేశ భద్రతతో రాజీ పడినట్లా కాదా? అన్నదే ప్రశ్న అంటూ నిలదీశారు.
ఇకపోతే, రైతుల భూములను లాక్కొని కాంగ్రెస్ పార్టీ అవినీతి పంట పండించిందని మోడీ ఆరోపించారు. రైతుల భూములు లాక్కున్న వారిని కోర్టు మెట్లు ఎక్కించానని, మరోసారి ఆశీర్వదిస్తే వారిని కటకటాల వెనక్కి నెడుతానని చెప్పారు. గతంలో ఉగ్రదాడులు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతోనే సమాధానమిచ్చేదని విమర్శించారు. తమ ప్రభుత్వం భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని, ఇప్పుడు మన జవాన్లు పాక్ భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను ఏరివేయగలుగుతున్నారని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.