బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కంగనా రనౌత్. ధైర్యానికి పెట్టింది పేరు. పురుష హీరోలకు ఏమాత్రం తీసిపోని నటి. ఈమె తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. నిజానికి వీరిద్దరూ మాజీ ప్రేమికులనే ప్రచారం ఉంది. ఈ కారణంగానే హృతిక్ రోషన్ భార్య సుసానేకు విడాకులు ఇచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి.
అయితే ఆ తర్వాత హృతిక్, కంగనా మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ విడిపోయారు. కంగనా విషయంలో హృతిక్ సైలెంట్‌గానే ఉన్నప్పటికీ.. కంగనా మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా హృతిక్‌పై విమర్శలు చేస్తుంటుంది.
ఈ పరిస్థితుల్లో త్వరలో హృతిక్‌తో బాక్సాఫీస్ వేదికగా పోటీ పడేందుకు సై అంటోంది. హృతిక్ సినిమా విడుదలవుతున్న రోజే తన సినిమా కూడా విడుదల కావాలని కంగనా పట్టుబడుతోందట. తెలుగు దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో కంగన నటించిన సినిమా ‘మెంటల్ హై క్యా’. ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయాలనుకున్నారు.
అయితే తాజాగా విడుదల తేదీని జూలై 26కు వాయిదా వేశారు. అదే రోజున హృతిక్ నటించిన ‘సూపర్ 30’ విడుదల కాబోతోంది. ‘మెంటల్ హై క్యా’ విడుదల తేదీని ఏకంగా నెల రోజుల పాటు వాయిదా వేయడానికి కంగన పట్టుదలే కారణమని తెలుస్తోంది. ‘సూపర్30’ ఓపెనింగ్స్‌ను దెబ్బకొట్టేందుకే కంగన ఇలా చేసిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. మరి, ఆ బాక్సాఫీస్ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూడాలంటే అప్పటివరకు ఆగాల్సిందే.