నోరు జారాను మన్నించండి : సుప్రీంకు రాహుల్ సారీ

0
56

సుప్రీం కోర్టుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భేషరతుగా క్షమాపణలు చెప్పారు. ‘చౌకీదార్ చోర్ హై’ వ్యాఖ్యలను కోర్టుకు తప్పుగా ఆపాదించానని, ఇందుకు చింతిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు అత్యున్నత సంస్థ అని, దానిపై తనకు అపార గౌరవం ఉందన్నారు.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వివాదంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సుప్రీంకోర్టు దొంగగా(చోర్) వ్యాఖ్యానించిందంటూ రాహుల్ గాంధీ గతంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ బుధవారం మరోసారి విచారణకు వచ్చింది.

ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మూడు పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేశారు. తన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు భేషరతుగా క్షమాపణలు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, అనుకోకుండా అలా మాట్లాడానని వెల్లడించారు.

తన క్షమాపణలను పరిగణనలోకి తీసుకొని ఈ కేసును మూసివేయాలని ప్రాధేయపడ్డారు. ఇదే కేసులో రాహుల్ ఏప్రిల్ 30న దాఖలు చేసిన అఫిడవిట్‌లో నేరుగా క్షమాపణలు కోరకుండా విచారం వ్యక్తంచేస్తున్నానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరో అఫిడవిట్ దాఖలు చేస్తానంటూ ధర్మాసనానికి విన్నవించారు.