కలవరపెడుతున్న క్రాస్ ఓటింగ్.. మెజార్టీపై భారీ పందేలు

0
56

గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన అభ్యర్థులను క్రాస్ ఓటింగ్ కలవరపెడుతోంది. దీనికితోడు గెలుపు తమదేనంటూ ఇరు పార్టీల అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. దీంతో ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందన్న అంశంపై జోరుగా పందేలు సాగుతున్నాయి.

ఈ స్థానంలో తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు, వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుపు తమదేనని ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పందేలు గెలుపు, ఓటములపై కాకుండా మెజార్టీపై జరుగుతుండటం గమనార్హం.

నియోజకవర్గంలో పట్టణంలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే అంశంపైనా చర్చ జరుగుతోంది. పట్టణ ఓటర్లు చేతిలోనే అభ్యర్థుల గెలుపు, ఓటములు ఆధారపడి ఉన్నాయి. రొంపిచర్ల మండలంలో మళ్ళీ వైసీపీకి మెజార్టీ లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి రొంపిచర్ల మండలంలో 6,387 ఓట్ల ఆధిక్యం లభించింది. పట్టణం, నరసరావుపేట రూరల్‌ మండలంలో కూడా వైసీపీనే ఆధిక్యం కనబరిచింది.

ఇకపోతే, వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గత ఎన్నికల్లో 15,766 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలుగుదేశం, బీజేపీ పొత్తుతో ఇక్కడ బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ నలబోతు వెంకటరావు పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈ సారి నరసరావుపేట రూరల్‌, పట్టణంలో వచ్చే మెజార్టీల పైనే అభ్యర్థుల గెలుపు, ఓటములు ఆధారపడి ఉన్నాయి.

ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మెజార్టీపై లక్షకు రూ.4 లక్షలు పందేలు జరుగుతున్నాయి. లక్షకు రెండు లక్షలు, లక్షకు మూడు లక్షలు ఇలా ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ మెజార్టీపై పందేలు పెద్దఎత్తున కాస్తున్నారు. ఇప్పటికే రూ.కోట్లలో చేతులు మారాయి. మెజార్టీపై పందేలు కాస్తుండటం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

నియోజక వర్గంలో మొత్తం 2,21,573 ఓట్లు ఉండగా 1,80,574 ఓట్లు పోలయ్యాయి. 81.50 శాతం ఓటింగ్‌ నమోదైంది. గత ఎన్నికల కంటే ఓటింగ్‌ శాతం 2.18 శాతం పెరిగింది. పట్టణంలో 73.58 శాతం, నరసరావుపేట రూరల్‌ మండలంలో 91.41శాతం, రొంపిచర్ల మండలంలో 90.05 శాతం ఓట్లు పోలయ్యాయి.