‘నిజం’ చెప్పులు వేసుకునేలోగా ‘అబద్ధం’ ప్రపంచం చుట్టూ తిరిగొస్తుంది…

0
69

టీవీ9 సీఈవో రవిప్రకాష్‌ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు, అరెస్టు చేసినట్టు వచ్చిన వార్తన్నీ వట్టి పుకార్లేనని తేలిపోయింది. ఆయన గురువారం రాత్రి 9 గంటలకు లైవ్ ప్రోగ్రామ్‌లో పాల్గొని, తన అరెస్టుపై వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అలాగే, టీవీ 9 సీఈవో పదవి నుంచి రవిప్రకాశ్ ను తొలగించారని, అరెస్టు చేశారని, చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

‘రవిప్రకాశ్‌ను ఎవరూ అరెస్ట్ చేయలేదు, చేయబోవట్లేదు. కొంతమంది తప్పుడు ఆరోపణలు పెట్టడానికి ప్రయత్నించారు. ‘నిజం’ చెప్పులు వేసుకునేలోగా ‘అబద్ధం’ ప్రపంచం చుట్టూ తిరిగొస్తుంది. ఈరోజు అదే జరిగింది. జర్నలిజం విలువల కోసం ఎప్పుడూ నిలబడ్డాం. భవిష్యత్తులోనూ నిలబడతాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ గందరగోళాన్ని కాస్త తగ్గించేందుకే మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను’ అంటూ వివరణ ఇచ్చారు.

‘రవి ప్రకాశ్ రెండు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రవి ప్రకాశ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. రవి ప్రకాశ్ తప్పించుకుని తిరుగుతున్నారు. రవి ప్రకాశ్ ఎవరి సంతకాన్నో ఫోర్జరీ చేశారు. రవి ప్రకాశ్ ‘టీవీ9’ నుంచి వేరే ఛానల్‌కు నిధులు మళ్లించారు’ అంటూ ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వార్తలను ప్రసారం చేయడం, స్క్రోలింగ్‌లు నడపడం చేస్తున్నారు. నా పట్ల ఇంత కన్సర్న్ ఉన్న సాటి ఛానెళ్లకు ధన్యవాదాలు’ అంటూ సెటైర్లు విసిరారు.

ఈరోజు ఉదయం నుంచి తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.’మీరు కొద్దిగా బాధ్యతాయుతంగా సరైన వార్తలను చూపించి ఉంటే బాగుండేది. భవిష్యత్ లోనైనా క్రెడిబుల్ న్యూస్ ఇస్తారని ఆశిస్తున్నాను’ అంటూ ఆయా ఛానెళ్లకు రవిప్రకాశ్ సూచించారు.