శ్రీ లక్ష్మీ పిక్చర్స్, శ్రావ్యా ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా ఎక్కలి రవీంద్రబాబు, బి. బాపిరాజు నిర్మిస్తున్న చిత్రం ‘రొమాంటిక్ క్రిమినల్స్’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన బి.బాపిరాజు మాట్లాడుతూ, ‘శ్రీ లక్ష్మీ పిక్చర్స్, శ్యావ్యా ఫిలింస్ బ్యానర్లలో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో గతంలో విడుదలైన ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ తరహలో సీక్వెల్‌గా ‘రొమాంటిక్ క్రిమినల్స్’ తెరకెక్కించాం. ఈ సినిమా పూర్తిగా నవ్యాంధ్రలో స్మార్ట్‌సిటీగా పేరుగాంచిన బ్యూటిఫుల్ సిటీ విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకుంది. ముసుగుల వెనుక వున్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాం.
గత రెండు చిత్రాల కంటే కూడా ప్రేక్షకుల్ని రంజింపజేస్తుంది. యువతని పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో హీరోగా మనోజ్ నందన్, విలన్‌గా వినోద్, హీరోయిన్స్ అవంతిక, దివ్య, మౌనిక.. చాలా చక్కటి నటన కనబర్చారు.
ఏజెన్సీ ఏరియాలో గంజాయి తోటలో పోలీసుల భద్రత మధ్య ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. వ్యసనాలు ఏమైనా వాటి పర్యవససానాలు తీవ్రంగా ఉంటాయనే పాయింట్‌ని.. వినోదం పాళ్ళు తగ్గించకుండా మా దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టకుంటుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ పొందిన మా ‘రొమాంటిక్ క్రిమినల్స్’కు త్వరలోనే రిలీజ్ ప్రకటిస్తాం అని చెప్పుకొచ్చారు.