సెలవుపై ఎన్నికల ప్రధానాధికారి.. ద్వివేది.. కారణం ఏంటో?

0
42

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఉన్నట్టుండి సెలవు పెట్టారు. ఈనెల 11వ తేదీ నుంచి ఈనెల 15వ తేదీ వరకు ఆయన సెలవులో వెళుతున్నారు. వ్యక్తిగత కారణాల కారణంగా ఐదు రోజుల పాటు సెలవుపై వెళుతున్నట్టు చెప్పారు.

నిజానికి దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టుగా తలాడిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా, పలు సందర్భాల్లో విపక్ష నేతల ఫిర్యాదులపై ఆగమేఘాలపై స్పందించారనీ, తమ ఫిర్యాదులను అసలు పట్టించుకోలేదనీ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

దీంతో టీడీపీ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. పైగా, ఈనెల 23వతేదీన వెలువడనున్న ఫలితాల్లో కూడా అక్రమాలు చోటుచేసుకోవచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన ఐదు రోజులపాటు సెలవుపై వెళ్లడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు, ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్క్రీనింగ్ కమిటీ నివేదించిన క్యాబినెట్ భేటీ అజెండాకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించవచ్చన్నారు. అయితే, అనుమతి వచ్చేందుకు రెండ్రోజుల సమయం పడుతుందని, బహుశా సోమవారం దీనిపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు. క్యాబినెట్ భేటీ జరిగేందుకే ఎక్కువ అవకాశాలున్నాయని ద్వివేది అభిప్రాయపడ్డారు.