టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. విచారణ నిమిత్తం శనివారం సైబరాబాద్ ప్రత్యేక పోలీసు బృందం, సైబర్ క్రైమ్ అధికారులు బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్ళగా ఆయన నివాసంలో లేరు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు సమాచారం.
అయితే, ఆయన ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదని, తమకేమీ చెప్పలేదని రవిప్రకాశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే, రవిప్రకాశ్ విచారణకు సహకరిస్తారని, ఇందుకోసం 10 రోజుల గడువు కావాలని రవిప్రకాశ్ తరపు న్యాయవాది పోలీసు ఉన్నతాధికారులను కోరినట్టు సమాచారం.
మరోవైపు, రవిప్రకాశ్ ఎక్కడికి వెళ్లారన్న విషయం తమకు కూడా తెలియదని టీవీ9 సిబ్బంది కూడా అంటున్నారు. రవిప్రకాశ్ ఫోన్లు కూడా స్విచ్చాఫ్‌లో ఉండడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయన కోసం గాలిస్తున్నారు. ఆయనపై ఫోర్జరీ సంతకాల కేసు నమోదైవున్న విషయం తెల్సిందే.
ఇదిలావుంటే, హీరో శివాజీ కూడా విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయనకు కూడా మరోమారు నోటీసులు పంపాలని భావిస్తున్నారు. ఈసారి కూడా హాజరు కాకపోతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనారు హెచ్చరించారు. టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిని పోలీసులు శనివారం రెండో రోజూ విచారించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది.