మెగాస్టార్ చిరంజీవిపై టాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి సెటైర్లు వేశారు. చిరంజీవి వంటి వ్యక్తి ఇపుడు మార్కెట్ కోసం సినిమాలు చేయాల్సిన రేంజ్ దాటిపోయాడన్నారు.
ముఖ్యంగా, చిరంజీవి ఇప్పుడు ఎలాంటి చిత్రం తీసినా చూస్తారని, అలాంటి వ్యక్తి ‘అమ్మడూ కుమ్ముడూ’ అనాల్సిన అవసరం లేదని, చిరంజీవి తన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలని సూచించారు. చిరంజీవి కెరీర్ పరంగా ఎంతో ఎదిగిపోయారని, ట్రెండ్‌ను ఫాలో అవడం కంటే ఆయనలాంటి వ్యక్తులు ట్రెండ్ సెట్ చేస్తేనే బాగుంటుందని అన్నారు.
ఒకప్పుడు సినిమాల్లో నంబర్ వన్‌గా ఉన్న చిరంజీవి రాజకీయాల్లోకి రావడం ద్వారా ఆ గౌరవానికి దూరమయ్యారని అభిప్రాయపడ్డారు. చిరంజీవి తన సినిమాల వరకు ఎవరూ కష్టపడనంతగా కష్టపడతారని, ఎంత వరకు చేయగలరో అంతా చేస్తారని, కానీ అంతకుమించి ఆలోచించే శక్తి ఆయనకు లేదని తేల్చి చెప్పారు. అందుకే ఆయన ఇతరులపై ఆధారపడతారని పరోక్షంగా నిర్మాత అల్లు అరవింద్‌ను గుర్తుచేశారు. ఇలాంటి ధోరణి రాజకీయాలకు ఏమాత్రం సరిపోదన్నారు.
రాజకీయాల్లోకి వచ్చేవాళ్లు తమంతట తాము ఆలోచించుకుని రావాలని, ఈ లక్షణం చిరంజీవిలో లేదన్న ఉద్దేశంతోనే తాను గతంలో చిరంజీవి రాజకీయాలకు పనికిరాడని వ్యాఖ్యానించానని తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు.