కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ ముగిసింది. హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై విజేతగా నిలిచి నాలుగోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఐపీఎల్‌లోని అసలైన మజాను ఈ మ్యాచ్ పంచింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి విజయం ముంబైనే వరించింది. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స జట్టు కేవలం ఒక్క పరుగు తేడాలో పరాజయం పాలైంది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి చెన్నై బౌలర్లు చుక్కలు చూపించారు. చెన్నై బౌలర్లు పోటీలు పడి వికెట్లు తీస్తుంటే ముంబై విలవిల్లాడింది. ఒకానొక దశలో 100 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. మెరుపులు మెరిపిస్తాడని ఆశలు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా 16 పరుగులకే వెనుదిరగడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
మరోవైపు క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ చేరుతుండడంతో ముంబై ఓటమి అప్పుడే ఖరారైనట్టు భావించారు. చివరికి కీరన్ పొలార్డ్ పుణ్యమా అని మొత్తానికి 149 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది.
25 బంతులు ఎదుర్కొన్న పొలార్డ్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. జట్టులో ఈ స్కోరే అత్యధికం కావడం గమనార్హం. డికాక్ 29, రోహిత్ శర్మ 15, సూర్యకుమార్ యాదవ్ 15, ఇషాన్ కిషన్ 23 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు తీసుకోగా, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
2013, 2015, 2017లో విజేతగా నిలిచిన ముంబయి.. ఇప్పుడు ఐపీఎల్-12లోనూ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా అవతరించింది. ముంబయి 2017 ఫైనల్లోనూ ఇదే ఉప్పల్ స్టేడియంలో ఒక్క పరుగు తేడాతో నెగ్గడం విశేషం. 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున కప్ అందుకున్న రోహిత్‌శర్మ.. ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.