వీకెండ్ వ్య‌వ‌సాయం బాగా క‌నెక్ట్ అవుతోంది…

0
75

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం మహర్షి. ఈ చిత్రం ఈనెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతోంది. మరోవైపు, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

అయితే, ఈ చిత్రంలో రైతు గొప్పతనాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి టచ్ చేశారు. ఇది చాలామందిని కదిలించింది. దేశానికి అన్నం పెట్టే రైతుకు ఏదైనా జ‌రిగింద‌నే వార్త వ‌స్తే దానిపై మ‌నం సానుభూతి చూపిస్తాం. కానీ, కానీ రైతుకు కావాల్సింది జాలి కాదు.. గౌర‌వం. రైతును కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌న అంద‌రిదీ అనే సందేశం ఇస్తూ ఈ చిత్రాన్ని ముగించారు.

సాధారణంగా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ వ్యవసాయానికి దూరంగా ఉంటారు. ముఖ్యంగా, సాఫ్ట్‌వేర్ టెక్కీలు అయితే వీకెండ్ పార్టీల్లో మునిగితేలుతుంటారు. అయితే, ‘మహర్షి’ చిత్రం వచ్చిన తర్వాత చాలామంది టెక్కీల్లో మార్పు వచ్చింది. మహర్షి సినిమా పుణ్యమాని వారాంతంలో వ్య‌వ‌సాయం చేయ‌డానికి ప‌లువురు ఆస‌క్తి చూపిస్తున్నారు. చాలా మంది యువ‌త వీకెండ్ వ్య‌వ‌సాయం చేసి ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ వీకెండ్ వ్య‌వ‌సాయం ట్రెండింగ్ అవుతుంది.

ఇలా వీకెండ్ వ్య‌వ‌సాయం చేసిన వారిలో నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్ కూడా ఉన్నారు. మ‌ధుర శ్రీధ‌ర్‌తో పాటు అమిత్ సజానే వారాంత‌పు వ్య‌వ‌సాయం చేసి పోస్ట్ చేసిన ఫోటోల‌కు మ‌హేష్ రిప్లై ఇచ్చారు. ‘వీకెండ్ వ్య‌వ‌సాయం బాగా క‌నెక్ట్ అవుతుంది. ఇది మ‌న భ‌విష్య‌త్ తరాల‌కు గొప్పప్రారంభం. మ‌ధుర శ్రీధ‌ర్, అమిత్ స‌జానే వాళ్లు ఈ కార్య‌క్ర‌మాన్ని త‌మ భుజాల‌కు ఎత్తుకున్నందుకు వారికి ధ‌న్య‌వాదాలు’ అంటూ మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో రిప్లై ఇచ్చారు.