శ్రీలంకలో హింస : ముస్లిం వ్యాపార సంస్థలు ధ్వంసం

0
47

శ్రీలంకలో హింస చెలరేగింది. ముస్లిం వ్యాపార సంస్థలను క్రైస్తవులు ధ్వంసం చేస్తున్నారు. ఏప్రిల్ 21వ తేదీ ఈస్టర్ సండే రోజున ఐసిస్ ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన విషయం తెల్సిందే. ఈ పేలుళ్ళ కోసం శ్రీలంకకు చెందిన ఓ ముస్లిం పారిశ్రామికవేత్త కుటుంబ సభ్యులంతా ఏకంగా ఆత్మాహుతి బాంబర్లుగా మారిపోయి విధ్వంసం సృష్టించారు. ఈ ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 250 మందికిపైగా చనిపోగా 500 మంది వరకు గాయపడ్డారు. ఈ దాడుల నుంచి శ్రీలంక ఇపుడిపుడే కోలుకుంటోంది. శ్రీలంకలో ఎమర్జెన్సీ కొనసాగుతోంది. దీంతో ఉద్రిక్త వాతావరణం నలకొనివుంది.

తాజాగా శ్రీలంకలో సోషల్ మీడియా కారణంగా కొన్ని క్రైస్తవ సంఘాలు ముస్లిం షాపులపై దాడులకు దిగి విధ్వసం సృష్టించాయి. దీంతో ఫేస్‌బుక్, వాట్సాప్‌పై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. అల్లర్లు వ్యాపించిన ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రకటించింది. శ్రీలంకలోని ఛిలా పట్టణానికి చెందిన ఓ ముస్లిం వ్యాపారి ‘ఇంకా నవ్వకండి.. ఏదో ఒకరోజు మీరు ఏడుస్తారు’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

అయితే ఇది క్రైస్తవులను ఉద్దేశించి చేశారనీ, మళ్లీ ఉగ్రదాడి జరగబోతోందని సోషల్ మీడియాలో కొందరు క్రైస్తవులు భావించారు. వెంటనే కొన్ని క్రైస్తవ సంఘాలు ముస్లిం వ్యాపారస్తుల షాపులే లక్ష్యంగా విధ్వంసానికి దిగాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, సైన్యం గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితులు అదుపుతప్పకుండా కర్ఫ్యూ విధించారు. అలాగే, శాంతి భద్రతలు మరింతగా దిగజారకుండా ఫేస్‌బుక్, వాట్సాప్‌లపై నిషేధం విధించారు.