ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా సమాఖ్య కూటమి (ఫెడరల్ ఫ్రంట్)ని అధికారంలోకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇందులోభాగంగా, ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో గత వారం సమావేశం కాగా, సోమవారం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరూ దాదాపు గంటకు చర్చలు జరిపారు. ఈ సుదీర్ఘ భేటీలో దేశంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
అలాగే, ప్రాంతీయ పార్టీలను బలమైన శక్తులుగా మార్చేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ ఖరారుపై వీరు మాట్లాడుకున్నట్టు సమాచారం. భేటీ అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో ఏమీ మాట్లాడలేదు. చెన్నై నుంచి కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. వారం వ్యవధిలో సీఎం కెసిఆర్ తమిళనాడుకు వెళ్లడం ఇది రెండోసారి.
వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు బయలుదేరే ముందే స్టాలిన్‌ను కలిసేందుకు ప్రయత్నించినా కొన్ని కారణాల నేపథ్యంలో అది వీలు పడలేదు. అనంతరం స్టాలిన్ 13వ తేదీన చెన్నైకి రావాలంటూ కేసీఆర్‌ను ఆహ్వానించడంతో సిఎం చెన్నైకి వెళ్లారు. అందులోభాగంగానే కేంద్రం లో ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషించాలని డిఎంకే అధినేత స్టాలిన్‌తో కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది.