భారత జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేనే స్వతంత్ర భారత తొలి తీవ్రవాది అని విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమర్థించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జాతిపితను హత్య చేసిన గాడ్సేను మహాత్ముడని పిలవాలా? లేక రాక్షసుడని పిలవాలా? అని ఆయన ప్రశ్నించారు. అందువల్ల స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది హిందువేననీ ఆయన స్పష్టం చేశారు.
బాపూ గుండెల్లోకి తూటాలు పేల్చినవాడు రాక్షసుడు కాక మంచివాడు ఎలా అవుతాడని ఒవైసీ అడిగారు. ‘నాథూరాం గాడ్సే లాంటి వ్యక్తిని టెర్రరిస్ట్ అనాలా? లేక హంతకుడు అనాలా? గాంధీజీ హత్య విషయంలో కపూర్ కమిషన్ నివేదికలో కుట్ర విషయం తేటతెల్లమయింది. కాబట్టి గాడ్సేను టెర్రరిస్ట్ అనే చెప్పాలి. అతను నిజంగా ఉగ్రవాదే’ అని స్పష్టం చేశారు.