కోల్క‌కతాలో రణరంగంగా మారిన అమిత్ షా రోడ్‌షో

0
53

కోల్‌కతా వేదికగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన రోడ్‌షో కాస్త రణరంగాన్ని తలపించింది. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ‘సేవ్ రిపబ్లిక్ ర్యాలీ’ ఉద్రిక్తతకు దారితీసింది.

అమిత్ షా ర్యాలీ కోల్‌కత్తా యూనివర్సిటీని సమీపించగానే లెఫ్ట్ శ్రేణులకు, బీజేపీ శ్రేణులకు మధ్య గొడవ జరిగింది. అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

లెఫ్ట్ శ్రేణులకు వర్సిటీ విద్యార్థులు కూడా మద్దతుగా నిలిచి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘అమిత్ షా గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

విద్యాసాగర్ కాలేజీ, యూనివర్సిటీ హాస్టల్ బయట తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. హాస్టల్ గేట్లను మూసివేసి, హాస్టల్ బయట ఉన్న సైకిల్స్, మోటార్‌బైక్స్‌ను బీజేపీ కార్యకర్తలు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితి మరింత అదుపు తప్పింది.

హాస్టల్ బయట ఉన్న చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. టీఎంసీ శ్రేణులు బీజేపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డాయని అమిత్ షా చెప్పారు. మమత ప్రభుత్వం రోడ్ షోను అడ్డుకోవాలని చూసిందని విమర్శించారు. మమత కూడా అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి గూండాల్ని రప్పించి అమిత్ షా గొడవలు సృష్టించారని ఆమె విమర్శించారు.