విదేశీ బ్యాంకుల్లో ఒక్క పైసాలేదు.. పేదరికమే నా కులం… నరేంద్ర మోడీ

0
42

తనకు విదేశీ బ్యాంకుల్లో ఒక్క పైసా ఉన్నా చూపించడం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సవాల్ విసిరారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ ప్రధానిగా రెండు దశాబ్దాల పాటు ఎంతో నిబద్ధతతో పని చేశానని ఆయన చెప్పుకొచ్చారు.

యూపీలోని బల్లియాలో నిర్వహించిన ఓ సభలో ప్రసంగిస్తూ… తనకు అక్రమ ఆస్తులు కానీ, ఫాంహౌస్‌లు కానీ, షాపింగ్ కాంప్లెక్సులు కానీ, విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముగానీ ఉంటే చూపించాలని సవాల్ విసురుతున్నానని చెప్పారు. రూ.కోట్ల విలువ చేసే విదేశీ కార్లు, ఖరీదైన బంగ్లాలు ఉంటే నిరూపించాలని అన్నారు.

పేదల సొమ్మును లూఠీ చేయాలని కానీ, ధనవంతుడిని కావాలని కానీ తాను ఏనాడూ కలలు కనలేదన్నారు. వ్యక్తిగత జీవితం కంటే తనకు పేదల సంక్షేమం, మాతృభూమి రక్షణే ముఖ్యమన్నారు. తనపై విపక్షాలు చేస్తున్న విమర్శలను బహుమతిగానే తాను భావిస్తానని చెప్పారు.

ఇకపోతే, ఆయన వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. ఆఖరి దశలో ఇక్కడ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గమైన వారణాసి ఓటర్లకు మోడీ ఓ వీడియో మెసేజ్ పంపారు. వారణాసిలో తాను ప్రచారం చేయకపోవచ్చనే సంకేతాలను ఈ వీడియో ద్వారా ఇచ్చారు.

‘వారణాసిలో నేను రోడ్ షోకు వచ్చినప్పుడు… మరోసారి ఇక్కడకు రావద్దని మీరు నన్ను ఆదేశించారు. అన్ని విషయాలను సమర్థవంతంగా మీరే చూసుకుంటామని చెప్పారు. మీ మాటలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. మోడీ గెలవాలని కాశీలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు’ అని మోడీ తెలిపారు.

వారణాసిలోని ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మోడీ కోరారు. దేశం మొత్తం కాశీవైపే చూస్తోందన్నారు. ఎన్నికలకు సంబంధించిన రికార్డులను ఈసారి కాశీ తిరగరాయాలని చెప్పారు. సంప్రదాయ దుస్తులను ధరించి ఓటు వేయాలని కోరారు.