వివేకా హత్యకు 60 రోజులు… అయినా వీడని చిక్కుముడి

0
56
ys vivekananda reddy
ys vivekananda reddy

మాజీమంత్రి, వైకాపా నేత వివేకానంద రెడ్డి హత్య జరిగి సరిగ్గా 60 రోజులు గడిచాయి. ఆనాటి నుంచి సిట్‌ దర్యాప్తు సాగిస్తూనే ఉంది. జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి ఏప్రిల్‌ 29న వివేకా హత్యను తేల్చేందుకు 11 బృందాలను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

ప్రతి బృందంలో ఓ సీఐ, ఎస్‌ఐలు ఉంటూ వారికి అప్పజెప్పిన బాధ్యతలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగించారు. ప్రధానంగా మూడు అంశాలను తీసుకున్నారు. మొదటిది వివేకాకున్న వివాహేతర సంబంధాలు, రెండోది భూ దందాలు, సెటిల్‌మెంట్లు, రియల్‌ ఎస్టేట్‌.. మూడో అంశం కుటుంబ సభ్యుల పాత్ర ఏమిటన్న దానిపై ఈ 11 బృందాలకు బాధ్యతలు అప్పజెప్పారు.

వివేకా హత్యపై పులివెందుల పోలీసుస్టేషన్‌లో క్రైమ్‌ నెం.84/2019 నమోదై సీఆర్‌పీసీ 302, 201 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. ఈ 11 బృందాలు దర్యాప్తు వేగవంతం చేసి వీలైనంత త్వరలో వివరాలను సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే, 11 బృందాలు ప్రస్తుతం దర్యాప్తును వేగవంతం చేశాయి. వివేకానందరెడ్డి వ్యవహారాలు, దందాలు, వివాహేతర సంబంధాలపై దృష్టి పెట్టి వాటిపైనే విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో డ్రైవరుగా పనిచేసిన ఓ వ్యక్తి వివాహేతర సంబంధం వ్యవహారాల్లో వివేకాతో వివాదం నెలకొందని, అదేవిధంగా రెండో వివాహం చేసుకున్న ఓ మహిళకు ఆరు నెలల్లో రూ.3 కోట్లతో సెటిల్‌మెంటు చేసుకునేలా ఒప్పందాలు జరిగినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.

రియల్‌ ఎస్టేట్‌ చేస్తూనే పవర్‌ ఆఫ్‌ పట్టా బినామీల పేర్లతో పెట్టడం వంటివి పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యాయి. వివేకా వ్యవహారాలు తవ్వే కొద్దీ ఇలాంటివే ఎన్నో వెలుగులోకి వచ్చాయని కానీ హత్యకు ప్రేరేపించేలా ఈ వ్యవహారాలేవీ జరగలేదని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

కుటుంబంలో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా ఆ కుటుంబంలో ఎంతో కీలకమైన వ్యక్తులే. సాక్షులు, వివేకాతో సన్నిహితంగా మెలిగేవారిని ఇలా అందరినీ గట్టిగానే విచారించి వివరాలు రాబట్టినా ఈ హత్యకు, వారికి సంబంధాలు లేవని తేలినట్లు ప్రచారం సాగుతోంది.

తన సొంత ఇంటిలోని బాత్రూమ్‌లో దారుణ హత్యకు గురైన వివేకా మృతదేహాన్ని శుభ్రం చేయడం, సాక్ష్యాలు తారుమారు చేయడం వంటి అంశాలు కుటుంబ సభ్యులకు తెలిసే జరిగాయని ప్రత్యేక దర్యాప్తు బృందాలు నిర్ధారించినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అందరి నుంచి సమాచారం రాబట్టిన పోలీసులు వివేకా కుటుంబ సభ్యుల నుంచి వివరాలు రాబట్టడంలో పూర్తిగా వెనుకబడుతున్నారు.

కారణం.. రాజకీయ నేపధ్యం కలిగిన కుటుంబం కావడంతో ఏదైనా తొందరపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న భయం పోలీసు వర్గాల్లో కనిపిస్తున్నట్లు సమాచారం. తమదైన శైలిలో పోలీసులు విచారణ జరిపితే కుటుంబ సభ్యులు కూడా నోరు విప్పి చెబుతారని అంత సాహసం పోలీసులు చేస్తారా అన్న విమర్శలున్నాయి.

అన్నివిధాల దర్యాప్తుల్లోనూ ఏమీ తేలలేదని కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాత్ర, సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఎన్నికల ఫలితాలనంతరం ఈ కేసు మిస్టరీ వీడుతుందని అప్పటివరకు అంతా సస్పెన్సే అన్నట్లుగా ఉంది.