ఎడతెరిపి లేకుండా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వల్ల చాలా మంది టీమిండియా క్రికెటర్లు అలసి పోయారని చెప్పక తప్పదు. ప్రపంచకప్ ప్రారంభానికి కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలివుండడంతో క్రికెటర్లు కనీస విరామం లేకుండానే బరిలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది.
భారత జట్టు కీలక క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, జస్‌ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా తదితరులు ఈ ఐపిఎల్ సీజన్‌లో ఆఖరు వరకు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబై, చెన్నైలు ఫైనల్‌కు చేరడంతో ఈ ఆటగాళ్లకు తగిన విశ్రాంతి లేకుండా పోయింది. దీంతో వీరి ఫిట్‌నెస్‌కు సంబంధించి ఆందోళన నెలకొంది. వరుస క్రికెట్‌తో చాలా మంది క్రికెటర్లు అలసి పోయారనే చెప్పాలి.
సుదీర్ఘ కాలంపాటు సాగిన ఐపిఎల్‌లో టీమీండియాకు ఎంపికైన చాలా మంది ఆటగాళ్లు కనీస విరామం లేకుండా సతమతమవుతున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ శిఖర్ ధావన్, సీనియర్లు ధోని, జడేజా, భువనేశ్వర్ తదితరులు ఎడతెరిపి లేకుండా క్రికెట్‌తో అలసి పోయారు.
దీంతో ప్రపంచకప్‌లో వీరు పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతారా లేదా అనేది అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. భారత జట్టులో ఎంపికైన ఆటగాళ్లలో ఇప్పటికే కేదర్ జాదవ్ ఫిట్‌నెస్ లేమితో బాధపడుతున్నాడు. అతను ప్రపంచకప్ నాటికి కోలుకుంటాడా లేదా అనేది సందేహంగా మారింది. భువనేశ్వర్ కుమార్ కూడా ఫిట్‌నెస్‌తో లేడనే వార్తలు వినవస్తున్నాయి.
ఇదే జరిగితే భారత్‌కు ప్రపంచకప్‌లో పెద్ద ఎదురు దెబ్బగా చెప్పాలి. మరోవైపు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాత్రం ఆటగాళ్లందరూ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారని, ప్రపంచకప్‌లో సమరోత్సాహంతో బరిలోకి దిగుతారనే నమ్మకంతో ఉన్నాడు. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లభించని మాట వాస్తవమేనని, అయితే దాని ప్రభావం ప్రపంచకప్‌ను పడుతుందని తాను భావించడం లేదని రవిశాస్త్రి ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్న విషయం తెలిసిందే.