మ్యాజిక్ మార్క్ దాటేశాం… రాసుకోండి.. బీజేపీకి 300 సీట్లు : అమిత్ షా

0
63

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఇప్పటివరకు జరిగిన ఆరు దశల ఎన్నికల్లోనే తమ పార్టీకి మ్యాజిక్ మార్కు (272 సీట్లు) సీట్లు వస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు.

ఆయన విలేకరులతో మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలకు పోలింగ్ ముగిసిపోయిందని, ప్రభుత్వాన్ని సునాయాసంగా ఏర్పాటు చేసే మెజార్టీ మార్క్‌ను ఇప్పటికే దాటి వేశామన్నారు. దేశవ్యాప్తంగా ప్రచారానికి దిగిన తరుణంలో తాను జనం నాడిని పసికట్టినట్లు, రాబోయేది మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే అని తాను ఖచ్చితంగా చెప్పగలనని తెలిపారు.

ఐదో, ఆరో దశ పోలింగ్ సరళిని చూసిన తర్వాత తన నమ్మకం మరింత పెరిగిందని, ఏడో దశ పోలింగ్ ముగిస్తే 300 సంఖ్యాబలం దాటుతామనే నమ్మకం ఉందని షా తెలిపారు. ఎన్నికలలో ఎన్ని స్థానాలు గెలుస్తాయని అనుకుంటున్నారని మీడియా వారు అడుగుతున్నారని, దీనికి తాను ఇచ్చే సమాధానం ఇప్పటికే మెజార్టీ మార్క్ దాటామనేదే అని తేల్చిచెప్పారు.

ఈ నెల 19వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఏడో దశ పోలింగ్ జరుగుతుంది. దీనితో మొత్తం పోలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. మొత్తం 543 సభ్యుల లోక్‌సభలో ప్రభుత్వ స్థాపనకు కావాల్సిన సాధారణ సంఖ్యాబలం 270. ఇది సింపుల్ మెజార్టీగా లెక్కలోకి వస్తుంది. గత లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి 282 స్థానాలు వచ్చాయి. మునుపటి కన్నా ఎక్కువ స్థానాలను బీజేపీ దక్కించుకుంటుందని, తిరిగి ప్రధాని అయ్యేది మోడీనే అని, జన స్పందన ఇందుకు అనుగుణంగానే ఉందని అమిత్ షా తేల్చిచెప్పారు.

ఎన్నికల ఫలితాలు వెలువడడానికి మరో వారం సమయం ఉన్నప్పటికీ దేశరాజధానిలో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు మొదలైపోయాయి. వెంటనే ప్రారంభించడం అత్యవసరమని భావించిన కాంగ్రెస్‌ ఈ దిశగా తొలి అడుగు వేసింది. భాగస్వామ్యపక్షాలను తన శిబిరంలో కొనసాగించుకుంటూనే కొత్త మిత్రుల కోసం అన్వేషణ మొదలెట్టింది. ఈ విషయమై యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.