రంగంలోకి దిగిన సోనియా గాందీ… విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు…

0
44

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ రంగంలోకి దిగారు. ఈ నెల 19వ తేదీన చివరి దశ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ రంగంలోకి దిగారు. బీజేపీని అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఆమె చర్యలు చేపట్టారు. ఇందుకోసం విపక్ష పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే రోజున గానీ ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లోగానీ ఆమె న్యూఢిల్లీలో ఓ సమావేశాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో సీట్లు లభిస్తాయని అంచనా వేస్తున్న బలమైన ప్రాంతీయ పక్షాలను ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు.

ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చని భావిస్తున్న ఒడిశా ప్రాంతీయ పార్టీ బిజూ జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌ను కూడా ఆమె ఆహ్వానించారని తెలిసింది. ప్రాంతీయపక్షాలతో రాయబారాలు సాగించే బాధ్యతను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు అప్పగించారు.

ఈ విషయంపై బీజేడీ నేతలు స్పందిస్తూ, సీఎం నవీన్‌ పట్నాయక్‌తో సోనియా రాయబారం సాగించినట్లు బిజూ జనతాదళ్‌ సూటిగా ధ్రువీకరించలేదు. ‘ఇందులో అంత ఉత్సుకత ఏముంది? ఎన్నికల సమయంలో ఇవన్నీ మామూలే. పార్టీలన్న తర్వాత చర్చలు సర్వసాధారణం. మొదట ఫలితాలు రానివ్వండి’ అంటూ బీజేడీ అధికార ప్రతినిధి ప్రతాప్ కేసరీ దేవ్‌ మీడియాతో అన్నారు. ఇన్నాళ్లూ బీజేడీ కాంగ్రెస్‌, బీజేపీలకు సమదూరం పాటిస్తూ వచ్చిన విషయం తెల్సిందే.

కానీ ఈసారి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా, ఎస్పీ, బీఎస్పీ, ఆప్‌లతో కూడా సంప్రదింపులు జరుపుతారా.. అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అదేవిధంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ విషయంలోనూ కాంగ్రెస్‌ వైఖరి ఇంకా వెల్లడి కాలేదు. సోనియా ఏర్పాటు చేయబోయే సమావేశ ఉద్దేశం ప్రధానంగా బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడమని బయటకు వినిపిస్తున్న మాట.