అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నమూసిన రాళ్ళపల్లి నర్సింహారావుతో తనకున్న అనుబంధాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. రాళ్లపల్లి ఇకలేరని వార్త విన్న నటీనటులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
రాళ్ళపల్లి మృతిపై చిరంజీవి స్పందిస్తూ, ‘చెన్నైలోని వాణి మహల్‌లో డ్రామాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్ళపల్లి గారిని కలిశాను. స్టేజ్ మీద ఆయన నటన చూసి ముగ్ధుడినయ్యాను. ఆయన నటనను ఎంతో అభిమానించే వాడిని. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు. నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. దాంతో ఆయనతో అనుబంధం పెరిగింది.
ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. చక్కని స్నేహశీలి. చాలా రోజుల తర్వాత ఆ మధ్య ‘మా’ ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాను. ‘ఎలా ఉన్నావు మిత్రమా?’ అంటూ ఇద్దరం ఒకరిని ఒకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు అయ్యింది.
ఇంతలో ఆయన తనువు చాలించారంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేసుకుంటున్నాను’ అని చిరంజీవి విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.