ప్రముఖ నటుడు రాళ్లపల్లి(73) అనారోగ్యంతో చనిపోయారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. అందులో ఒకరు చనిపోయారు. మరో కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఈయన పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈయన `స్త్రీ` అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి 800కి పైగా సినిమాల్లో నటించారు. రాళ్లపల్లి పూర్తి పేరు రాళ్లపల్లి వెంకట నరసింహారావు, అయితే ఇంటి పేరుతోనే ఆయన ప్రసిద్ధి చెందారు.
రాళ్లపల్లి రంగస్థల నటుడిగా జీవితం ప్రారంభించారు. చిన్నతనం నుంచే ఆయన నాటకాలు వేసేవారు. ఆయన ఇప్పటి వరకు 800 పైగా సినిమాల్లో నటించారు. ఏ పాత్రలోనైనా రాళ్లపల్లి ఒదిగిపోయేవారు. నాటి స్టార్ హీరోలందరి చిత్రాల్లోనూ రాళ్లపల్లి నటించారు.
“చండశాసనుడు, తూర్పు వెళ్లే రైలు, అభిలాష, ఖైదీ, దేశోద్దారకుడు, అన్వేషణ, కలిసుందాం రా, జయం” చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. రాళ్లపల్లి చివరిసారిగా నాని నటించిన “భలే భలే మగాడివోయ్” చిత్రంలో నటించారు.
దర్శకుడు జంధ్యాల, వంశీల పరిచయంతో రాళ్లపల్లి హాస్యనటుడిగా పరిచయమయ్యారు. ఈ ఇద్దరి దర్శకత్వం వహించిన దాదాపు అన్నీ సినిమాల్లో రాళ్లపల్లి నటించారు. “సితార, కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, అన్వేషణ, ఏప్రిల్ 1 విడుదల, జోకర్, ఆలాపన” వంటి చిత్రాల్లో నటించి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.