ధర్మారెడ్డి.. ఏమిటి ఈ అధర్మం… ఈసీకి లంచాలిచ్చారా?

0
47

పేరు.. ఏవీ ధర్మారెడ్డి… ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. ఈయన పేరు ఒక్కసారిగా మీడియాలో మార్మోగిపోతోంది. దీనికి కారణం చంద్రగిరి అసెంబ్లీ స్థానంలో టీడీపీకి మంచి పట్టున్న ఐదు చోటు రీపోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు లంచాలు ఇచ్చినట్టు టీడీపీ నేతలు ఆరోపణలు చేయడమే.

నిజానికి ఈయన గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఓ వెలుగు వెలిగారు. 2004లో వైఎస్‌ అధికారంలోకి వచ్చినప్పుడు డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. కొంతకాలం తర్వాత ఆయన్ను ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) జేఈవోగా నియమించారు.

అయితే, చట్టప్రకారం ఆయన నియామకం చెల్లదని న్యాయ వివాదాలు కూడా నడిచాయి. దీంతో ఆయన కోసం ప్రత్యేకాధికారి పదవిని వైఎస్‌ ప్రభుత్వం కొత్తగా సృష్టించి అందులో నియమిస్తూ జీవో ఇచ్చింది. అప్పటివరకు టీటీడీలో ఈవో, జేఈవోలు మాత్రమే ఉండేవారు. అప్పుడు ధర్మారెడ్డిని కొనసాగించేందుకు ప్రత్యేకాధికారి పోస్టును ఏర్పాటు చేశారు.

తర్వాత 2010లో టీటీడీలో ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణం జరిగింది. దీనిపై ధర్మారెడ్డిపైనే ఆరోపణలు వచ్చాయి. దాన్ని ఆయన ఖండించారు. అయితే ఆ సమయంలో టీటీడీ ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ధర్మారెడ్డిని మార్చాలంటూ టీటీడీ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఫలితంగా నాటి ముఖ్యమంత్రి రోశయ్య ఆయన్ను అంత ప్రాధాన్యం లేని సమాచార హక్కు చట్టం కార్యదర్శిగా నియమించారు.

అనంతరం డిప్యుటేషన్‌ గడువు ముగియడంతో ధర్మారెడ్డి డిఫెన్స్‌ సర్వీసుకు వెళ్లిపోయారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ధర్మారెడ్డే ఈసీ అధికారులకు లంచాలిచ్చారని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషనర్ల సమక్షంలోనే ఆరోపించడంతో ఇన్నాళ్లకు మళ్లీ ఆయన పేరు ఆకస్మికంగా వెలుగులోకి వచ్చింది.