90 కోట్ల మంది బీజేపీకే ఓటు వేశారు : నరేంద్ర మోడీ

0
69

సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ తమ పార్టీ విజయావకాశాలపై మాట్లాడారు. దేశంలోని 90 కోట్ల మంది ఓటర్లు తమ పార్టీకే ఓటు వేశారనీ, అందువల్ల ఎన్డీయే కూటమి 300 సీట్లతో అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మేం పూర్తి మెజారిటీ సాధిస్తామని నాకనిపిస్తోంది. అనేక దశాబ్దాల తరువాత దేశంలో అధికారపక్షం పూర్తి మెజారిటీ సాధించి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదే అవుతుంది’ అని చెప్పుకొచ్చారు.

తొంభై కోట్ల మంది ఓటర్లు బీజేపీకే అధికారాన్ని కట్టబెట్టాలని ఏనాడో స్థిర నిర్ణయానికొచ్చారని చెప్పారు. ‘2014 మే 17న నిజాయితీగల ఓ ప్రభుత్వం ప్రయాణం ఆరంభమైంది. నాటి ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయంతో కాంగ్రెస్‌ కలలు కల్లలయ్యాయి. కాంగ్రెస్‌ గెలిచి అధికారంలోకి వస్తుందని సట్టా బజార్‌లో పందాలు కాసిన వారంతా నష్టపోయారు. ఈ ఐదేళ్లలో దేశంలో ప్రతి ఒక్కరికీ కావల్సింది అందించాం. మళ్లీ ఈ రోజు మే 17. మరో ప్రయాణం ఆరంభమవుతోంది’ అని చెప్పుకొచ్చారు.

‘తదుపరి ప్రభుత్వాన్ని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. మేం మా మేనిఫెస్టో ద్వారా చాలా హామీలు ఇచ్చాం. కొత్త ప్రభుత్వం ఒక్కొక్కటిగా వాటిని నెరవేరుస్తుంది’ అని చెప్పారు. మీడియాకు కృతజ్ఞతలు చెప్పడానికే ఇక్కడికొచ్చానంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మాత్రం బదులివ్వలేదు. ‘ఒకప్పుడు ఎన్నికల వల్ల ఐపీఎల్‌ మ్యాచ్‌లు భారత్‌ నుంచి వేరే చోటికి తరలించారు. ఇపుడలా కాదు… రంజాన్‌, ఈస్టర్‌, రామనవమి, పండగలు, ఐపీఎల్‌, బోర్డు పరీక్షలూ అన్నీ ఎన్నికలకు సమాంతరంగా సాఫీగా సాగాయి. మీ ఆశీస్సులకు కృతజ్ఞతలు. దేశ ప్రజలు మా వెన్నంటే ఉన్నారు. మీ ద్వారా వారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నా’ అని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.