కేంద్రంలో మళ్లీ కాషాయం రెపరెపలు : ఎగ్జిట్ పోల్స్

0
47

దేశ ప్రధానిగా మరోమారు నరేంద్ర మోడీ పగ్గాలు చేపడుతారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఆ తర్వాత అనేక సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి.

నరేంద్ర మోడీనే మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. ఈ సారి కూడా ఎన్డీఏనే అత్యధిక స్థానాలను గెలుచుకోబోతుందని ఈ సంస్థ సర్వే పోల్స్ సూచిస్తున్నాయి. అధికారం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఈ సర్వే చెబుతోంది.

ఈ సంస్థ సర్వే ప్రకారం ఎన్డీయేకు 306, యూపీఏకు 132 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. 104 స్థానాల్లో ఇతరులు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. 2014 ఎన్నికల్లో ఎన్డీయేకు 336 స్థానాలురాగా, యూపీఏకు 62, ఇతరులు 145 స్థానాల్లో గెలుపొందారు.

సీ-ఓటర్ సర్వేలో ఎన్డీఏకు 287, యూపీఏకు 128, ఇతరులకు 127 స్థానాలు వస్తాయని తేలింది. జన్ కీ బాత్ సర్వేలో ఎన్డీఏకు 305, యూపీఏకు 124, ఇతరులకు 113 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేలింది.