ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు సైకిల్, తెలంగాణాలో ఓటర్లు కారును ఎక్కారని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పుకొచ్చారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేనందున అక్కడ ఓటర్లు కారు ప్రయాణాన్నే కోరుకున్నారని, లోటు బడ్జెట్, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ ఓటర్లకు వారికున్న పరిస్థితుల రీత్యా సైకిలే మార్గమైందన్నారు.
ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశమే లేదని, పూర్తి ఆధిక్యతతోనే ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. తెలుగు ప్రజల తీర్పు ఎప్పుడూ స్పష్టంగా ఉంటుందే తప్ప గజిబిజిగా ఉండదని, ఈ సారీ అలాగే స్పష్టమైన ఆధిక్యతతో ఒక పార్టీకి పట్టం కట్టబోతున్నారని జోస్యం చెప్పారు.
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కంటే, ఆయన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీకి తక్కువ స్థానాలు వస్తాయని, పవన్ కల్యాణ్ శాసనసభలో అడుగుపెడతారని తెలిపారు. రాష్ట్రంలోని 90-93శాతం ఓటర్లు తెదేపా, వైకాపా, జనసేన పార్టీలకే ఓట్లేశారని అన్నారు. 2014 ఎన్నికల్లో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్ల శాతంలో స్వల్ప తేడాయే ఉందని, ఈ సారి మూడో పార్టీ అయిన జనసేన పోటీలో ఉండటం వల్ల తెదేపా, వైకాపాలకు గతం కంటే ఓట్ల శాతం తగ్గుతుందన్నారు.
తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, ఏ రాజకీయ పార్టీలోనూ తాను లేనని, ప్రజల నాడిని శాస్త్రీయంగా తెలుసుకోవటం తనకు ఆసక్తి అని చెప్పారు. దాని ఆధారంగానే ప్రస్తుతం తన అంచనాను వెల్లడించానని అన్నారు. శాస్త్రీయంగా ఆర్జీ ఫ్లాష్‌టీమ్ నిర్వహించిన సర్వే ప్రకారం ఏపీలోని శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో, తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని వస్తాయనేది ఆదివారం సాయంత్రం 6 గంటలకు తిరుపతిలో ప్రకటిస్తానని వివరించారు.
ఎవరు గెలుస్తారో చెప్పటం ముఖ్యం కాదని.. ఎన్ని స్థానాలు వస్తాయనేది చెప్పటమే తనకు ముఖ్యమని, అప్పుడే తన విశ్వసనీయత నిలబడుతుందన్నారు. ‘కేంద్రంలో ఇప్పటికే రెండు కూటములు ఉన్నాయి. మూడో కూటమి ఏర్పడుతోంది. నాలుగో కూటమికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నా అంచనా ప్రకారం ఏ కూటమికీ స్పష్టమైన ఆధిక్యత రాదని చెప్పారు.
పైగా, తాను గత పదిహేనేళ్ల నుంచి సర్వేలు చేస్తున్నా. ఎక్కడా మా లెక్కలు తప్పలేదు. కొన్ని సందర్భాల్లో ఆధిక్యతల వివరాలు కూడా చెప్పా. ఖచ్చితంగా వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉప ఎన్నికలు నిర్వహించిన సందర్భాల్లో కాంగ్రెస్ ఎంపీగా ఉంటున్నప్పటికీ కూడా తెరాస, వైకాపానే గెలుస్తుందని చెప్పాను. అలాగే జరిగింది. కడప లోక్‌సభకు జగన్ పోటీ చేసినప్పుడు ఆధిక్యతను కూడా చెప్పాను. మాకు అందే ప్రజల నాడి ప్రకారమే వివరాలు వెల్లడిస్తాను తప్ప, ఎవరి ఒత్తిడికో, ఎవర్నో మెప్పించటానికో, ఇంకెవర్నో ప్రభావితం చేయటానికో కాదు. ఈ నెల 23వ తేదీన ఫలితాలు విడుదలైనప్పుడు ఆదివారం నేను విడుదల చేసే సర్వే ఫలితాలు ఒకేలా ఉంటాయి.
తెలంగాణ ఎన్నికల సమయంలో పలు చోట్ల స్వతంత్రులు ముందున్నారని నేను చెప్పా.. చిలకజోస్యమని నిందలు వేశారు. నేను సర్వే చేశాను.. దాని ప్రకారమే ఈ ఫలితాలు వచ్చాయని వివరించేందుకు అప్పట్లో ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించా. తెలంగాణలో నేను చెప్పిన స్వతంత్రులు అందరూ రెండో స్థానంలో నిలిచారు. ఆ రాష్ట్రం విషయంలో నా సర్వే ఎందుకు విఫలమైందో 23 తర్వాత చెప్తా. ఆదివారం ప్రకటించే సర్వే ఫలితాలు నా విశ్వసనీయతకు పరీక్ష. ఈ ఫలితాలను నమ్మటం, నమ్మకపోవటం వారివారిష్టం. అయితే బెట్టింగులకు పాల్పడటం సరికాదు. అది నేరమని లగడపాటి రాజగోపాల్ చెప్పుకొచ్చారు.