జమున… ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలనాటి చిత్రాల్లో సత్యభామ ఎవరంటే ఠక్కున చెప్పే సమాధానం జమున పేరు. ఆమె ఎన్టీఆర్, శోభన్ బాబు, అక్కినేని నాగేశ్వర్ రావు, కృష్ణ వంటి అగ్రనటులతో నటించారు. అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆమె ఇప్పటితరం హీరోయిన్లు, సినిమాలపై తన ఆవేదనను వ్యక్తంచేసింది. తమ కాలంలో రొమాంటిక్ సీన్స్ తీయాలంటే అందుకు పరిమితి అంటూ ఒకటి ఉండేదని ఆమె తెలిపారు. తమ హయాంలో సెన్సార్ బోర్డు కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉండేదన్నారు. ఇప్పటి సినిమాల్లో కొన్ని సన్నివేశాలు చాలా అసభ్యకరంగా ఉంటున్నాయని జమున ఆవేదన వ్యక్తం చేశారు.
హిందీ సినిమాల పోటీని తట్టుకునేందుకు తాము రొమాంటిక్ సన్నివేశాలను సినిమాలో పెడుతున్నామని ఈ తరం నిర్మాతలు చెబుతున్నారన్నారు. ఈ క్రమంలోనే తాను ఇప్పటి సినిమాలు చూడడం లేదని, పాత సినిమాలు మాత్రమే చూస్తున్నానని ఆమె తేల్చి చెప్పారు.
ఇప్పుడు వస్తున్న హీరోయిన్లు కూడా కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని, మంచి వేషాలపై వారు దృష్టి పెట్టడం లేదని జమున చెప్పారు. నేటి తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లే కనిపించడం లేదని, ఇతర భాషల నుంచి హీరోయిన్లను తీసుకొస్తున్నారని, వారు వచ్చిరాని తెలుగులో మాట్లాడుతున్నారని జమున పేర్కొన్నారు. నిర్మాతలు, దర్శకులు వెతికితే తెలుగులో ఎంతో మంది మంచి నటీమణులు దొరుకుతారని ఆమె అభిప్రాయపడ్డారు.