తాను విజయవాడ రావాలని ఎన్నడూ ప్లాన్ చేసుకోలేదని, కానీ కనకదుర్గమ్మ పిలిస్తే ఇక్కడకు వచ్చినట్టు ప్రిన్స్ మహేశ్ బాబు చెప్పుకొచ్చారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా, అశ్వనీదత్, దిల్‌రాజు, పీవీపీ కలిసి సంయుక్తంగా నిర్మించారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం విజయోత్సవ వేడుక విజయవాడలో జరిగింది. ఇందులో మహేశ్ పాల్గొని మాట్లాడుతూ, ‘రాజకుమారుడు’ చేసినప్పుడు తొలి పది రోజులు ఏం అర్థం కాలేదు. ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో తెలీదు. ఓ స్నేహితుడిలా చూసుకున్నారు రాఘవేంద్రరావు మావయ్య. ‘నువ్వు పెద్ద సూపర్ స్టార్ అవుతావు’ అని ఆరోజే అన్నారు. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేను.
ముగ్గురు పెద్ద నిర్మాతలు కలిసి ఈ సినిమా చేయడం గర్వంగా ఉంది. కథ విన్నప్పుడే భారీ విజయం సాధిస్తుందని అనుకున్నా. డెహ్రాడూన్‌లో తొలి రోజు షూటింగ్ ముగిశాక ‘పోకిరి స్క్వేర్ అవుతుంది’ అన్నాను. ఈ సినిమాలో మూడు పాత్రలూ బాగా నచ్చాయి. అందులో విద్యార్థి పాత్ర మరింత కిక్ ఇచ్చింది. సినిమా నచ్చితే అభిమానులు ఏ స్థాయికి తీసుకెళ్తారో నాకు తెలుసు. నా గత చిత్రాల రికార్డులన్నీ ఒక్క వారంలో దాటించారు. చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇంకేం చేయలేను’ అని అన్నారు.